ప్రమాద తీవ్రత ఇంత ఉంటుందని ఊహించలేదు.. కొడుకు అగ్ని ప్రమాదంపై పవన్ ఆవేదన

ప్రమాద తీవ్రత ఇంత ఉంటుందని ఊహించలేదు.. కొడుకు అగ్ని ప్రమాదంపై పవన్ ఆవేదన

సింగపూర్: అగ్ని ప్రమాదంలో తన కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీడియాకు తెలిపారు. ప్రమాద తీవ్రత ఇంత ఉంటుందని ఊహించలేదని, అరకు పర్యటనలో తనకు ఫోన్ కాల్ వచ్చిందని పవన్ చెప్పారు. తన కుమారుడికి జరిగిన ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారని తెలిపారు. పెద్ద కుమారుడు అకీరా పుట్టినరోజే రెండో కుమారుడికి ఇలా జరగడం బాధాకరమని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.

స్కూల్ పిల్లలు సమ్మర్ క్యాంప్కు వెళ్లారని, సమ్మర్ క్యాంప్ స్కూల్లో చిన్న అగ్ని ప్రమాదం జరిగిందని, ఈ అగ్ని ప్రమాదం వల్ల మార్క్ శంకర్ ఊపిరితిత్తుల్లోకి పొగ చేరిందని పవన్ చెప్పారు. చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయని వివరించారు. అవసరమైన సహాయం చేసేందుకు చాలా మంది ముందుకు వచ్చారని, ఈ సమయంలో తనకు అండగా నిలిచిన అందరికీ పవన్ ధన్యవాదాలు తెలిపారు.

మార్క్ శంకర్ ఆరోగ్యంపై ఆరా తీసిన మోదీ, చంద్రబాబు, లోకేశ్, హోం మంత్రి అనిత, జగన్, కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన పవన్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆ పిల్లాడి ఆరోగ్యం నిలకడగానే ఉంది. సోదరుడి కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలిసి చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి సింగపూర్ వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. పవన్తో పాటే చిరంజీవి దంపతులు కూడా సింగపూర్ వెళ్లనున్నారు.