దోపిడి చేసే చట్టాలను పాటించాల్సిన అవసరం లేదన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నరసాపురంలో మత్స్యకార అభ్యున్నతి సభలో మాట్లాడిన పవన్.. వైసీపీ పిచ్చి వేషాలకు జనసేన భయపడదని అన్నారు. సంయమనం తమ బలహీనత కాదని.. బలమని అన్నారు. అక్రమ కేసులకు వ్యతిరేకంగా ఏ స్థాయిలోనైనా పోరాడుతానన్నారు. ఒక్క మాట మాట్లాడాలన్నా తాను చాలా ఆలోచించి మాట్లాడుతానన్నారు. ఓ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతగా వ్యవహరిస్తానన్నారు. రాష్ట్రంలో ఉన్న లక్షన్నర మంది మత్స్యకారులకు 217 జీవో పెద్ద సమస్యగా మారిందని పవన్ విమర్శించారు. జనసేనకు కనీసం 10 మంది ఎమ్మెల్యేలు ఉండి ఉంటే 217 జీవో వచ్చేది కాదన్నారు. 217 జీవో పేపర్లను చింపేసిన పవన్.. మత్స్యకారుల కోసమే ఈ పనిచేశానని చెప్పారు. జీవోను చించినందుకు తనను జైలుకు పంపితే వెళతానని చెప్పారు.
చట్టాలను తాను నమ్ముతానని కానీ ఇబ్బంది పెట్టే చట్టాలను ఉల్లంఘిస్తానన్నారు పవన్. తాను భయపడేందుకు రాజకీయాల్లోకి రాలేదని.. వంగి వంగి దండాలు పెట్టేందుకు రాజకీయాల్లోకి రాలేదన్నారు. చిన్న వలతో సముద్రంలోకి వెళ్లేందుకు ఎంతో ధైర్యం ఉండాలన్న పవన్.. వారి సాహసమే తనకు స్ఫూర్తి అని అన్నారు. లేని సమస్యలను సృష్టించడంలో వైసీపీ నేతలు ఉద్ధండులన్నారు. పెన్షన్లు, ప్రభుత్వ సాయం రాదంటూ వైసీపీ నేతలు బెదిరిస్తున్నారన్నారు. వైసీపీ బ్రాందీషాపు పక్కనే చీకుల కొట్టులు పెట్టుకోవాలన్నారు. వైసీపీకి అధికారం ఇచ్చింది మటన్ కొట్లు, చికెన్ కొట్లు నడపమని కాదన్నారు. వైసీపీ పాదయాత్ర చేసింది మటన్ ,చేపలు అమ్ముకోవడానికా ? అని ప్రశ్నించారు. ఏపీలో రోడ్లన్నీ అధ్వానంగా మారాయన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని గోతులమయం చేసిందన్నారు పవన్.
పాదయాత్రలో మత్స్యాకారులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని చట్టాలు ఇతరులకు తప్ప మీకు వర్తించవా అని ప్రశ్నించారు. ఏటా 25 వేల మంది మత్స్యకారులు ఏపీ నుంచి గుజరాత్ కు వలస వెళ్తున్న విషయాన్ని పవన్ గుర్తు చేశారు. దగ్గర డబ్బు ఉండకూడదనే వైసీపీ నేతల ఆలోచన అని.. అందరూ దేహీ అని అడుక్కోవాలన్నారు. ఇది ప్రజాస్వామ్యం అని నియంతృత్వ రాజ్యం కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో మీరు నాకు అండగా నిలబడాలని అన్నారు. తాను చావడానికైనా సిద్ధమే కానీ తలవంచేందుకు కాదని పవన్ తేల్చిచెప్పారు.