
ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరముందన్నారు. చంద్రబాబుతో భేటీ అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఎన్నికలు తమ దృష్టిలో లేవని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకాలన్నారు. అందుకోసం టీడీపీ ఇతర పార్టీలతో కలిసి కార్యచరణ ప్రారంభిస్తామని తెలిపారు. తనకు మద్దతు తెలిపినందుకు టీడీపీ అధినేత చంద్రబాబుకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడలో పవన్ కల్యాణ్ ఉన్న నోవాటెల్ హోటల్‌కు వచ్చిన చంద్రబాబు.. విశాఖలో జరిగిన ఘటనలపై పవన్ కళ్యాణ్ తో చర్చించారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్ని పార్టీలతో కలిసి పోరాటం చేస్తం : చంద్రబాబు
ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్ని పార్టీలతో కలిసి పోరాటం చేస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఇదే విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చెప్పానన్నారు. విశాఖలో పవన్ కళ్యాణ్ పై ప్రభుత్వం వ్యవహరించిన తీరు తనకు బాధ కలిగించిందన్నారు. ఆయనకు సానుభూతిని తెలియచేసేందుకే పవన్ ను కలిశానన్నారు. పవన్ ను తిరగనీయకుండా చేయాలని ప్రభుత్వం కుట్రలు చేస్తోందని.. ఇదేనా ప్రజాస్వామ్యం అని చంద్రబాబు ప్రశ్నించారు. రాజకీయ పార్టీలకు రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్ధితి ఏంటో అర్ధం చేసుకోవాలన్నారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడలేదన్నారు. వైసీపీ లాంటి నీచమైన రాజకీయ పార్టీని ఎక్కడా చూడలేదన్నారు.