వినోదంతో పాటు విలువలు పెంచే సినిమాలు రావాలి : పవన్​ కళ్యాణ్​

వినోదంతో పాటు విలువలు పెంచే  సినిమాలు రావాలి : పవన్​ కళ్యాణ్​

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘గేమ్ చేంజర్’.  జనవరి 10న వరల్డ్‌‌వైడ్‌‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు.  ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ ఉన్నా.. రామ్ చరణ్ ఉన్నా.. దానికి కారణం చిరంజీవి గారు. చిరంజీవి గారిలా  రామ్ చరణ్ కూడా  సినిమా కోసం ఎంత కష్టపడతాడో నాకు తెలుసు.  ఈ మూవీలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో అని నేను కూడా  ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.  ‘రంగస్థలం’ సినిమాలో చరణ్ యాక్టింగ్ చూసి ఆశ్చర్యపోయా.  ‘మగధీర’ సినిమాలో అతడి హార్స్  రైడింగ్ చూసి స్టన్ అయ్యా.  

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే రామ్ చరణ్‌‌కు ఈ చిత్రంతో మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. శంకర్ గారి సినిమాలంటే నాకు ఇష్టం. సామాజిక సందేశాన్ని అందిస్తూ ఆయన సినిమాలు తీస్తుంటారు. ఈ సినిమాలోనూ మంచి మెసేజ్ ఇస్తున్నారని ట్రైలర్ ద్వారా అర్ధమైంది.  ఇక  సినిమా  టికెట్ రేట్లు డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. సినిమా రంగానికి రాజకీయ రంగు పులమడం నాకు ఇష్టం ఉండదు. అన్ని ఇండస్ట్రీల వ్యక్తులు కలిసి సినిమాల్ని చేస్తున్నారు. హాలీవుడ్‌‌ని అనుకరించడం కాకుండా మన మూలాల్ని పైకి తెచ్చేలా కథల్ని తీసుకురావాలి.  సినిమాలో మంచి చెడులూ ఉంటాయి. ఏది తీసుకోవాలనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. 

వినోదంతో పాటు ఆలోచింపజేసే చిత్రాలు కూడా రావాలని కోరుకుంటున్నా. గేమ్ చేంజర్‌‌‌‌ చిత్రంతో  కొత్త సంవత్సరంలో బాక్సాఫీస్ బద్దలైపోవాలి.  అలాగే  ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్ ద్వారా యువతికి ఉపాధి కల్పించాలని దిల్ రాజు గారిని కోరుతున్నా’ అని అన్నారు.   రామ్ చరణ్ మాట్లాడుతూ ‘తెరపై నేను ‘గేమ్ చేంజర్‌‌‌‌’గా నటిస్తే.. నిజ జీవితంలో మాత్రం ఇండియన్ పాలిటిక్స్‌‌కు అసలైన గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన లాంటి వ్యక్తినిచూసి ఈ కథ రాశారు’ అని చెప్పాడు.  తమను  బ్లెస్ చేయడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పారు డైరెక్టర్ శంకర్.  ప్రస్తుత రాష్ట్రాల్లో జరుగుతున్న చాలా సన్నివేశాలు ఈ సినిమాకు కనెక్ట్‌‌ అవుతాయని నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ అన్నారు.  నటులు శ్రీకాంత్, ఎస్‌‌జే సూర్య, అంజలి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.