అక్టోబర్ 2న పవన్ కళ్యాణ్ శ్రమదానం

  • రోడ్ల మరమ్మత్తు కార్యక్రమాల్లో పాల్గొననున్న పవన్ కళ్యాణ్
  • ఏపీలో రోడ్ల దుస్థితిపై జనసేన తరపున నిరసన పోరాటం

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై పలుమార్లు విమర్శలు గుప్పించిన ఆయన ఇక వేచి చూసేది లేదంటూ ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగనున్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ప్రభుత్వానికి నిరసన తెలియజేసేందుకు గాంధీ జయంతి రోజును మూహూర్తంగా ఫిక్స్ చేసుకున్నారు. దెబ్బతిన్న రోడ్ల దుస్థితిని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పార్టీ శ్రేణులతో కలసి శ్రమదానం చేసి మరమ్మత్తు చేయాలని నిర్ణయించారు. 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందంటూ బహిరంగంగా తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం స్పందించి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని అల్టిమేటం జారీ చేశారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన కనిపించకపోవడంతో జనసేన పార్టీ శ్రేణులతో కలసి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. 
ఏపీ ప్రభుత్వానికి నిరసన తెలియజేయడంతోపాటు తన పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడానికి పవన్ కళ్యాణ్ రెండు చోట్ల శ్రమదాన కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించారు. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ పై అక్టోబర్ 2న ఉదయం 10గంటలకు పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. కాటన్ బ్యారేజీపై దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మత్తు చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు అనంతపురం జిల్లా కొత్తచెరువుకు చేరుకుంటారు. ఈ గ్రామం వద్ద పుట్టపర్తి –ధర్మవరం రోడ్డు మరమ్మత్తు చేసే కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో కలసి పవన్ కళ్యాణ్ పాల్గొంటారు.