ఏపీలో ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి పీక్స్ కి చేరింది. అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్న నేపథ్యంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నామినేషన్ల కోసం దాఖలు చేసే అఫిడవిట్లో నేతలంతా తమ ఆస్తులు, అప్పులు, క్రిమినల్ కేసుల వివరాలు వెల్లడిస్తున్న క్రమంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన ఆస్తులు, అప్పుల వివరాలు హాట్ టాపిక్ గా మారాయి. అఫిడవిట్లో తెలిపిన ప్రకారం పవన్ ఆస్తులు, అప్పుల వివరాలు ఇలా ఉన్నాయి. గత ఐదేళ్ళలో పవన్ కళ్యాణ్ ఆదాయం రూ.114.76కోట్లు కాగా, అప్పులు 64.26 కోట్లు ఉన్నాయని తెలిపారు. ఇందులో వివిధ బ్యాంకుల నుండి రూ .17.56కోట్లు ఉండగా, వ్యక్తుల నుండి రూ.46.70కోట్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా జనసేనకు ఇచ్చిన విరాళాలు 17.15కోట్లు, వివిధ సంస్థలకు ఇచ్చిన విరాళాలు రూ.3.32కోట్లుగా ఉన్నాయని తెలిపారు.