ఆ మాటలు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయ్.. కుమారుడి హెల్త్ కండిషన్‎పై పవన్ కల్యాణ్ బిగ్ అప్డేట్

ఆ మాటలు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయ్.. కుమారుడి హెల్త్ కండిషన్‎పై పవన్ కల్యాణ్ బిగ్ అప్డేట్

హైదరాబాద్: అగ్ని ప్రమాదంలో గాయపడ్డ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‎ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్టు పెట్టిన పవన్.. తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని.. గాయాల నుంచి కోలుకుంటున్నాడని పేర్కొన్నారు. మార్క్ శంకర్ క్షేమాన్ని ఆకాంక్షించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. 

క్లిష్ట సమయంలో వారి సందేశాలు, ప్రార్థనలు తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయన్నారు. సింగపూర్‎లో తన కుమారుడు అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడని తెలిసిన వెంటనే.. ప్రత్యేక చొరవ చూపి సింగపూర్‎లో చికిత్సకు సహకరించిన ప్రధాని మోడీ, పీఎంవో కార్యాలయ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఈ నెల (ఏప్రిల్) 8వ తేదీన సింగపూర్లో సమ్మర్ క్యాంప్‎కు వెళ్లిన పవన్ చిన్నకుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే.

అగ్ని ప్రమాదంలో కాళ్లకు, చేతులకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో మార్క్ శంకర్‎ అస్వస్థతకు గురి కాగా సింగపూర్‎లో చికిత్స అందించారు. కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలియగానే పవన్ తన షెడ్యూల్ ఉన్నఫలంగా క్యాన్సిల్ చేసుకుని ఫ్యామిలీతో కలిసి సింగపూర్ వెళ్లారు. మార్క్ శంకర్ ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు.

దీంతో కుమారుడిని పవన్ కల్యాణ్ ఇండియాకు తీసుకొచ్చారు. భార్య అన్నా లెజినోవా, కుమారుడితో కలిసి సింగపూర్ నుంచి బయలుదేరిన పవన్ ఆదివారం (ఏప్రిల్ 13) ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా హైదరాబాద్‎లోని నివాసానికి వెళ్లారు. ఎయిర్ పోర్టులో పవన్ స్వయంగా గాయపడ్డ కుమారుడిని ఎత్తుకుని నడిచారు. పవన్ కల్యాణ్ వస్తున్నాడని తెలియడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఎయిర్ పోర్టు వద్దకు చేరుకున్నారు. అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ స్వల్ప గాయాల నుంచి బయటపడటంతో మెగా ఫ్యామిలీ, పవన్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.