
ఏపీలో ఎన్నికల పొత్తులపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2023 జూలై 17 మంగళవారం ఢిల్లీలో జరిగే ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరయ్యేందుకు అక్కడికి వెళ్లిన పవన్.. మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఎన్నికల పొత్తుపై బీజేపీ అగ్రనేతలతో చర్చి్ంచే అవకాశం ఉందన్నారు. ఈ అవకాశం కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. రేపటి భేటీ కోసం బీజేపీ అగ్రనేతలు తనను అహ్వానించారని, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి మార్గాలపై రేపటి భేటీలో చర్చిస్తామని వెల్లడించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓడించాలని కంకణం కట్టుకున్న ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అదే సమయంలో ప్రతిపక్షాల ఐక్యతా సమావేశానికి ధీటుగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం ఢిల్లీలో ఎన్డీఏ కూటమి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కూటమి భేటీకి 38 పార్టీలు హాజరుకానున్నాయి.