స్కూల్‎లో భారీ అగ్ని ప్రమాదం.. పవన్ కల్యాణ్ కుమారుడికి గాయాలు

స్కూల్‎లో భారీ అగ్ని ప్రమాదం.. పవన్ కల్యాణ్ కుమారుడికి గాయాలు

అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదానికి గురయ్యాడు. సింగపూర్లో మార్క్ శంకర్ చదువుతోన్న పాఠశాలలో మంగళవారం (ఏప్రిల్ 8) అగ్ని ప్రమాదం జరిగింది. స్కూల్‎లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో శంకర్‎ గాయపడ్డాడు. మంటల ధాటికి శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు అయినట్లు సమాచారం. 

అలాగే.. ఊపిరితిత్తుల్లోకి పొగ దూరడంతో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది హుటాహుటిన శంకర్‎ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శంకర్‎కు సింగపూర్‎లోని ఓ  ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం అల్లూరి జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన తర్వాత ఆయన విశాఖకు వెళ్లాల్సి ఉంది. 

కానీ కుమారుడికి ప్రమాదం జరగడంతో పవన్ విశాఖ పర్యటనను రద్దు చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం మన్యం పర్యటన ముగియగానే అటు నుంచి సింగపూర్ బయలుదేరి వెళ్లనున్నారు. పవన్ కల్యాణ్ సింగపూర్ వెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలియడంతో మెగా, పవన్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. శంకర్ చికిత్సపై మెగా ఫ్యామిలీ ఎప్పటికప్పుడూ ఆరా తీస్తున్నట్లు తెలిసింది.