2019 ఎన్నికల నాటి నుండి ఏపీ రాజకీయాల్లో రాజోలు నియోజకవర్గం ఒక ప్రత్యేకత సంతరించుకుంది. గత ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక అసెంబ్లీ స్థానం అదే కావటమే ఇందుకు కారణం. అయితే, రాజోలు నుండి గెలుపొందిన రాపాక వరప్రసాద్ ఆ తర్వాత జనసేనకు దూరంగా ఉంటూ వైసీపీకి చేరువవ్వటంతో గెలిచిన ఒక్క సీటు కూడా జనసేన ఖాతాలో లేకుండా పోయింది. ప్రస్తుతం 2024 ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ఈసారి రాజోలు నియోజకవర్గాన్ని ఎలా అయినా దక్కించుకోవాలని పవన్ భావిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో రాజోలు సీటును రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ కేటాయిస్తున్నట్లు ప్రకటించింది జనసేన. గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసి గెలిచిన రాపాక వరప్రసాద్, ఇప్పుడు వైసీపీలో చేరి అమలాపురం లోక్ సభ బరిలో దిగనున్నాడు. ఈ క్రమంలో జనసేన ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ తరఫున మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు గొల్లపల్లి సూర్యారావు రాజోలు నుండి బరిలో దిగుతున్న నేపథ్యంలో ఈ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. మరి, రసవత్తరంగా జరగనున్న ఈ పోరులో జనసేన, వైసీపీలలో ఎవరు పై చేయి సాధిస్తారో వేచి చూడాలి.