రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై, అక్రమాలపై అధికారంలో ఉన్న ప్రభుత్వం మిన్నకుండి ఉండడం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ అన్యాయాలపై ఉక్కుపాదం మోపాలంటే.. ఏపీ అసెంబ్లీ మన చేతికి రావాలని ఆయన అన్నారు. ఈ రోజు గాజువాక అసెంబ్లీ అభ్యర్ధిగా నామినేషన్ వేసిన అనంతరం విశాఖలో జరుగుతున్న బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.. జిల్లాలో జరుగుతున్న అనేక భూకబ్జాలను, అక్రమాలను అధికార పార్టీ మంత్రి గంటా శ్రీనివాసరావే ప్రోత్సహించారని అన్నారు. విశాఖ సమీపంలో ఉన్న పెందుర్తి, పాడేరు లలో టీడీపీ నేతలు అనేక భూకబ్జాలకు పాల్పడ్డారని, ఇదంతా గంటా నేతృత్వంలోనే జరిగిఉంటుందని పవన్ అన్నారు.
ఈ ఎన్నికల్లో ప్రజలు గంటాకు గంట మోగించబోతున్నారని జనసేనాని ఎద్దేవా చేశారు. జిల్లాలో సుపరిపాలన రావాలంటే గంటాను చట్ట సభల్లోకి రాకుండా అడ్డుకోవాలన్నారు . టీడీపీ నేతల ఆగడాలను అడ్డుకునేందుకు ఈ ఎన్నికల్లో పెందుర్తి నుంచి పోటీ చేయబోతున్న
జనసేన అభ్యర్ధి వెంకట రామయ్య కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. వెంకట రామయ్య రాజకీయానుభవం ఉన్న వ్యక్తి అనీ, నిజాయితీ గల వ్యక్తి అనీ తెలిపారు. రాజకీయాల్లోకి రావాలంటే డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, నీతి, నిజాయితీతో పని చేస్తే అసెంబ్లీ అభ్యర్ధులుగా ప్రజలే పట్టం కడతారని పవన్ ఈ సందర్భంగా అన్నారు.