ఏపీలో హాట్ టాపిక్ : పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు..?

ఏపీలో హాట్ టాపిక్ : పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు..?

ఎన్నికల సమయం తరుముకు వస్తోంది. ప్రచారానికి సమయం లేదు. అధినేతలు అంతా అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నారు. ఏపార్టీకి ఆ పార్టీ గెలుపు గుర్రాలంటోంది. వ్యూహ ప్రతివ్యూహాలతో ఎన్నికల వాతావరణం.. రణాన్ని తల పిస్తోంది. ప్రధాన పార్టీల అధినేతలు చంద్రబాబునాయుడు, వైఎస్ జగన్ ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది వారికి ఫుల్ క్లారిటీ ఉంది.  జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీచేస్తారు?.. ఇదే ఆసక్తి కలిగించే అంశం.

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పం నుంచి పోటీ చేస్తారు. 1989 నుంచి ఇప్పటివరకు ఆరుసార్లు ఇక్క డ విజయం సాధించారు. మరోసారి అక్కడినుంచే బరిలో దిగనున్నారు. ఈ విషయం అందరికీ తెలుసు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పులివెందుల కంచుకోట. 1978 నుంచి వైఎస్ కుటుంబమే అక్కడ విజయం సాధిస్తూ వస్తోంది. 2014 లో జగన్ కూడా అక్కడినుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ రెండు స్థానాల్లో అధికార , విపక్ష నేతల గెలుపునకు సంబంధించి ఎవరికీ పెద్దగా సందేహాలు లేవు. మెజారిటీ ఎంత అన్నదే ఆసక్తి కలిగించే అంశం. వీరిద్దరి విషయం వదిలేస్తే ఇప్పుడు అందరి చూపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఉంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అనేది జనసేన వర్గాల్లోనే కాదు ప్రజల్లోనూ ఆసక్తికరంగా మారింది.

ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికలకు ముందే పార్టీ స్థాపించినా.. ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. ఇప్పుడు తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఏపీలో రాజకీయ మార్పు అనివార్యం అన్న నినాదంలో పోటీకి సిద్ధ మ య్యారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని చెబుతున్న జనసేనాని అభ్యర్థుల ఎంపిక కసరత్తులో ఉన్నారు. ఇతర పార్టీల కన్నా ముందే తొలి జాబితా కూడా విడుదల చేశారు. అయితే పవన్  ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విష యంలో మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ వీడలేదు.

పవన్ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం, విశాఖ నగరంలోని గాజువాక స్థానాల్లో ఏదో ఒకచోట నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై పవన్ పరిశీలన చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయన రెండు స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇవి కాకున్నా ఉభయగోదావరి జిల్లాల్లో ఏదో ఒకస్థానం నుంచి పవన్ పోటీ చేయడం ఖాయం అంటున్నాయి పార్టీలు వర్గాలు. గోదావరి జిల్లాల నుంచి ఓ స్థానం, ఉత్తరాంధ్ర నుంచి మరో స్థానంలో పవన్ పోటీ చేస్తారని జనసేన నేతలు చెబుతున్నారు. మరి ఇక్కడి నుంచే ఎందుకు పోటీ.. అనే సందేహాలకు సమాధానం కూడా వస్తోంది. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కన్నా విశాఖ జిల్లా గాజువాకలో లక్షకుపైగా జనసేన సభ్యత్వాలు నమోదయ్యాయి. పైగా కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువ. ఎన్నికల్లో వామపక్షాలతో జట్టుకట్టడం కూడా ఈ నియోజకవర్గం ఎంపికకు ఒక కారణం. గాజువాక ఇండస్ట్రియల్ ఏరియా కావడంతో అక్కడ కార్మిక వర్గ ఓటు బ్యాంకు ఎక్కువ.

తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం జనసేన సభ్యత్వాల నమోదు విషయంలో రెండో స్థానంలో ఉంది. కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువే. తూర్పుగోదావరి జిల్లాలో జనసేన ఎక్కువ బలంగా ఉందని పవన్ భావిస్తున్నారు. పిఠాపురం ప్రజాపోరాట సభలో… పిఠాపురం నుంచి పోటీ చేయాలని ఉందని పవన్ అన్న విషయం తెలిసిందే. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న పవన్.. ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒకదాన్ని నుంచి కన్ఫామ్ గా పోటీ చేస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ, వైసీపీ సంగతి పక్కన పెడితే.. ఈ ఎన్నికలు జనసేనకు చాలా కీలకం. కచ్చితంగా జనసేన సత్తా చాటాలి. దీంతో జనసేన ఎన్ని సీట్లు గెలుస్తుంది? అనే చర్చ జరుగుతోంది. పైగా పవన్ కళ్యాణ్ తొలిసారి బరిలోకి దిగుతున్నారు. ఇప్పటివరకు పవన్ సభలకు, స్పీచ్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. జనాలు భారీగా తరలివచ్చారు. మరి ఇదే క్రేజ్ ఓట్ల రూపంలో రాలుతుందా..? లేదా..? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.