టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుని మళ్లీ సీఎం పీఠంలో కూర్చోబెట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాపత్రయ పడుతున్నారని ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం వై ఎస్ జగన్ అద్భుతంగా పని చేస్తుంటే చంద్రబాబు కుట్రలు పన్ని అభివృద్ధికి అడ్డు పడుతున్నారని ఆరోపించారు. పవన్ చంద్రబాబు భజనే చేస్తున్నారని విమర్శించారు. పవన్ 6 నెలలకొకసారి రోడ్డపైకి వచ్చి ధర్నాలు చేస్తారని ఎద్దేవా చేశారు. వారాహి వాహనం ఎటు వెళ్లిందని ప్రశ్నించారు. కాపులను దగా చేసిన వారిలో బాబు, పవన్ మొదటి వరుసలో ఉంటారని విమర్శించారు.
భీమ్లానాయక్ సినిమాకు ఏపీలో నష్టాలు వచ్చాయని అంటున్నారని, సినిమా బాగుంటేనే జనం చూస్తారు, లేదా చూడరని పేర్ని అన్నారు. రూ.100 కోట్లు దాటిన పవన్ సినిమా ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. రూ. వంద కోట్ల మార్కెట్టే లేనప్పుడు రూ.30 కోట్ల నష్టం ఎలా వస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అన్ని వర్గాల వారికి జగన్ సమప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. 2019 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రిపీట్ అవుతాయని పేర్కొన్నారు.
చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా స్థాపించారా అని ప్రశ్నించారు. ప్రైవేటు విద్యాసంస్థలతో పోటీ పడి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు స్టేట్ టాపర్లుగా నిలుస్తున్నారని చెప్పారు. కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ కూడా సీఎం జగన్ ని ఫాలో అయిందని అన్నారు.