గరిష్ట పరిమితి కింద గ్రాట్యుటీ చెల్లించాల్సిందే: హైకోర్టు

గరిష్ట పరిమితి కింద గ్రాట్యుటీ చెల్లించాల్సిందే: హైకోర్టు
  • సింగిల్ జడ్జి తీర్పును సమర్థించిన బెంచ్ 
  • అప్పీల్ పిటిషన్ కొట్టివేత

హైదరాబాద్, వెలుగు: సవరించిన నిబంధనల మేరకు గరిష్ట గ్రాట్యుటీ చెల్లించాలంటూ గతంలో సింగిల్‌‌ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ ఎలక్ట్రానిక్‌‌ కార్పొరేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా లిమిటెడ్‌‌ (ఈసీఐఎల్‌‌) దాఖలు చేసిన అప్పీలును సోమవారం హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కొట్టేసింది. 2007 నుంచి 2010 మధ్య ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు గరిష్ట పరిమితి కింద గ్రాట్యుటీ చెల్లించాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది. 

కాగా, ఆ సమయంలో పెద్ద సంఖ్యలో ఎంప్లాయీస్ ఉద్యోగ విరమణ చేశారు. వాళ్లకు గ్రాట్యుటీ సీలింగ్‌‌ పరిమితి రూ.3.5 లక్షలు కాకుండా రూ.10 లక్షలుగా చెల్లించాలని అప్పీలెట్‌‌ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈసీఐఎల్‌‌ కు సింగిల్‌‌ జడ్జి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో సింగిల్‌‌ జడ్జి తీర్పును రద్దు చేయాలని ఈసీఐఎల్‌‌ దాఖలు చేసిన అప్పీలుపై చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ జె.శ్రీనివాస రావుతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ విచారణ జరిపింది. గ్రాట్యుటీ చట్టాన్ని 2010లో కేంద్రం సవరిస్తూ గ్రాట్యుటీ సీలింగ్‌‌ రూ.3.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిందని, ఇది 2010 మే 24 నుంచి అమల్లోకి వస్తుందని కూడా కేంద్రం చెప్పిందని తెలిపింది. పిటిషనర్లు 2010కి ముందే రిటైర్‌‌ అయ్యారు కాబట్టి వారికి పెంపు వర్తించదని ఈసీఐఎల్‌‌ లాయర్‌‌ వాదించారు. 

ఈ వాదనను ఈసీఐఎల్‌‌ ఎంప్లాయీస్ తరఫు అడ్వకేట్ తీవ్రంగా వ్యతిరేకించారు. 2007, జనవరి 1 నుంచి రూ.3.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని బోర్డు ఆఫ్‌‌ డైరెక్టర్స్‌‌ తీర్మానం చేసిందని గుర్తు చేశారు. 2008, నవంబరు 26న ఆఫీసు మెమోరాండం ప్రకారం ఉద్యోగులు గరిష్ట పరిమితి గ్రాట్యుటీకి అర్హులేనని వాదించారు. వాదనల తర్వాత అప్పీలును కొట్టివేస్తూ తీర్పు వెలువరించిన డివిజన్‌‌ బెంచ్‌‌ గ్రాట్యుటీ రూ.10 లక్షలు చెల్లించాలని ఈసీఐఎల్‌‌ను ఆదేశించింది.