లాస్ట్ ఇయర్ మార్చి బిల్లే కట్టాలి
కరెంటు బిల్లులపై ఈఆర్‌సీ మార్గదర్శకాలు
ఇండ్లకైతే ఇదే రూల్
షాపులు,కాంప్లెక్స్‌లు సగమే కట్టాలి
భారీ పరిశ్రమలకే బిల్లింగ్
ఫోన్లకు బిల్లు ఎస్ఎంఎస్ చేస్తరు
హైదరాబాద్, వెలుగు: కరోనా సందర్భంగా లాక్‌డౌన్ విధించడంతో ఈసారి కరెంటు మీటర్లో రీడింగ్ చూసి బిల్లు వేయడం లేదు. గతేడాది మార్చిలో వినియోగదారుడు ఎంత కరెంటు వాడారో దాన్ని ప్రామాణికంగా తీసుకోనున్నారు. కాస్తంత అటుఇటుగా బిల్లులిచ్చేందుకు డిస్కంలు చేసిన ప్రపోజల్స్‌కు అనుమతిస్తూ విద్యుత్ నియంత్రణ మండలి మంగళవారం ఆమోదం తెలిపింది. కట్టాల్సిన ఎమౌంట్‌ను ఏప్రిల్ 8 నుంచి కస్టమర్లకు మెసేజ్చేస్తారు. ఒకవేళ గతేడాది మార్చి తరువాత ఇచ్చిన కనెక్షన్లు ఉంటే ఈ ఏడాది మార్చిలో చెల్లించిన మొత్తమే కట్టాల్సి ఉంటుంది. 2020 మార్చిలోనే కనెక్షన్ తీసుకున్న వాళ్లకు మినిమమ్ బిల్లు వస్తుంది. వ్యాపార వాణిజ్య వర్గాలకు గతేడాది మార్చినెల బిల్లులో సగమే పంపిస్తారు. భారీ పరిశ్రమలకు మీటర్ రీడింగ్ చూసి బిల్లులు ఇస్తారు. ఎల్‌టీ యేతర కేటగిరీలో వ్యాపార, చిన్న, మధ్య తరహా, కుటీర పరిశ్రమల కనెక్షన్లు ఉన్నవారు 2019 మార్చి తరువాత కనెక్షన్ తీసుకుంటే 2020 మార్చిలో ఎంత వచ్చిందో అందులో 50 శాతం వస్తుంది. ఈ ఏడాది మార్చిలో తీసుకుంటే మినిమమ్ కట్టాలి. పరిస్థితులు చక్కబడ్డాక మీటర్ రీడింగ్ తీసి ఎవరు ఎన్ని యూనిట్ల విద్యుత్ వాడారన్నారో చూసి అందుకనుగుణంగా బిల్లుల్లో మార్పులు చేయవచ్చని ఈఆర్సీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. మున్సిపాల్టీలు, పంచాయతీల స్ట్రీట్ లైట్లు, ఎత్తిపోతల పథకాలు, తాగునీటి సరఫరా సంస్థలకు ఇదే తరహాలో బిల్లులు వసూలు చేస్తామని డిస్కంలు పేర్కొన్నాయి. కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాల ప్రకారం జనరేషన్ కంపెనీలకు డిస్కంలు చెల్లించాల్సిన బిల్లులపైనా మారటోరియం ఉండడంతో లేట్ పేమెంట్ ఫీజుని రద్దు చేస్తున్నట్లు ఈఆర్సీ ఆదేశాలిచ్చింది. కొత్త కనెక్షన్లు ఇవ్వడం, లోడ్ రివైజ్ చేయడం లాంటి ఎమర్జెన్సీ కాని పనుల విషయంలోనూ కస్టమర్ల కంప్లయింట్స్‌పై డిస్కంలకు పెనాల్టీలు ఉండవని తెలిపింది.
For More News..