బాధితులకు రూ.6 లక్షలు చెల్లించండి.. కన్స్ట్రక్షన్ కంపెనీకి రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఆదేశం

బాధితులకు రూ.6 లక్షలు చెల్లించండి.. కన్స్ట్రక్షన్ కంపెనీకి రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఆదేశం

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇండ్లు కట్టివ్వడంలో జాప్యం చేసినందుకు బాధిత కుటుంబానికి రూ.6.51 లక్షల పరిహారాన్ని చెల్లించాలని ఓ కన్స్ ట్రక్షన్ కంపెనీని రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఆదేశించింది. అద్దె విలువ రూ.5 లక్షలు, వాటితో పాటు ఆలస్యంగా ఇండ్లు అప్పజెప్పినందుకు రూ.46 వేలు, అగ్రిమెంట్​ను ఉల్లంఘించినందుకు రూ.లక్ష అందించాలని తీర్పు చెప్పింది. ఘట్కేసర్​కు చెందిన వసంత, దయాకర్ రెడ్డి దంపతులు హిమాయత్ నగర్​లో ఉన్న తమ ప్లాట్​లో ఇండ్లు కట్టివ్వాలని సికింద్రాబాద్​కు చెందిన కూర కన్‌స్ట్రక్షన్ కంపెనీని వారు సంప్రదించారు.

అగ్రిమెంట్ ప్రకారం 18 నెలల్లో ఇళ్లు అందించాల్సి ఉండగా.. ఆ కంపెనీ ఏడేండ్ల 8 నెలల తర్వాత అందించింది. కోరిన విధంగా సౌకర్యాలూ అందించలేదు. అగ్రిమెంట్ ప్రకారం ఆలస్యానికి తగిన రెంట్, సౌకర్యాలు అందించనందుకు ఖర్చులకు నష్టపరిహారం చెల్లించాలని కంపెనీని కోరగా నిరాకరించింది. దీంతో బాధితులు జిల్లా వినియోగదారుల  ఫోరంను సంప్రదించారు. ఆలస్యమైనందుకు రెంట్  రూ.5 లక్షలు, సౌకర్యాలు అందించనందుకు రూ.లక్ష  మొత్తాన్ని 9 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. జిల్లా ఫోరం తీర్పుపై కన్‌స్ట్రక్షన్  కంపెనీ.. రాష్ట్ర వినియోగదారుల ఫోరంలో అప్పీలు చేసింది. వాదనలు విన్న స్టేట్  ఫోరం.. జిల్లా వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పును సమర్థించింది.