గోదావరి రివర్ బోర్డుకు.. రూ.50 కోట్లు చెల్లించండి

గోదావరి రివర్ బోర్డుకు.. రూ.50 కోట్లు చెల్లించండి

 

  • మైనింగ్, టీఎస్ ఎండీసీని ఆదేశించిన ఎన్జీటీ చెన్నై బెంచ్
  • మానేరులో ఇసుక తవ్వకాలు చట్టవిరుద్ధం
  • గత బీఆర్ఎస్ సర్కార్ పర్యావరణ అనుమతులు తీసుకోలే
  • ఇసుక రీచ్​లు వెంటనే రద్దు చేయండి
  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశం

పెద్దపల్లి/కరీంనగర్‌‌‌‌‌‌‌‌, వెలుగు: మానేరులో ఇసుక తవ్వకాలు చట్టవిరుద్ధమని.. మైనింగ్, టీఎస్​ఎండీసీ విభాగాలు చెరో రూ.25 కోట్లు గోదావరి రివర్ మేనేజ్​మెంట్ బోర్డుకు చెల్లించాలని గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ మంగళవారం తీర్పు చెప్పింది. పర్యావరణ అనుమతులు లేకుండా మానేరులో ఇసుక రీచ్​లు ఏర్పాటు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. అదేవిధంగా, మానేరులోని అన్ని ఇసుక రీచ్​లను రద్దు చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ట్రిబ్యునల్ ఆదేశించింది. 

ఫైన్ మొత్తాన్ని మానేరు పరిరక్షణకు ఉపయోగించాలని సూచించింది. ఈ తీర్పు నివేదిక సమీక్ష కోసం కేసును సెప్టెంబర్ 23కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మానేరులో అనేక చోట్ల డిసిల్టేషన్ పేరుతో ఇసుక రీచ్​లు ఏర్పాటు చేసిందని, అవన్నీ చట్టవిరుద్ధమని తీర్పులో ట్రిబ్యునల్ పేర్కొన్నది. కాగా, మానేరులో చెక్ డ్యామ్​లు నిర్మించకుండానే పూడికతీత పేరుతో కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పరిధిలో ఇసుక రీచ్​లు ఏర్పాటు చేసి విధ్వంసానికి పాల్పడ్డారంటూ మానేరు పరిరక్షణ సమితి సభ్యులు ఎన్జీటీని ఆశ్రయించారు. 

ఇసుక తవ్వకాలతో మానేరు తీర ప్రాంత రైతులు జీవనోపాధి కోల్పోతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డిసిల్టేషన్ చట్టవిరుద్ధమని పేర్కొంటూ ఎన్జీటీలో ఐదు పిటిషన్లు దాఖలయ్యాయి. మూడేండ్లుగా ఇసుక అక్రమ తవ్వకాలపై చేసిన పోరాటం ఫలించినందుకు సంతోషంగా ఉందని మానేరు పరిరక్షణ సమితి సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.