‘సీఎం బ్రేక్​ఫాస్ట్’ అమలుకు సొంత పైసలు పెట్టుకోవాల్సిందే!

‘సీఎం బ్రేక్​ఫాస్ట్’ అమలుకు సొంత పైసలు పెట్టుకోవాల్సిందే!
  • ఇప్పటికే మధ్యాహ్న భోజన బకాయిలు రిలీజ్ చేయని సర్కార్
  • జీవో, గైడ్​లైన్స్ లేకుండా కుదరదంటున్న ఏజెన్సీలు 
  • అప్పులు ఎక్కడికెళ్లి తేవాలని ఫైర్​
  • డీఈవోలు, హెడ్మాస్టర్లపై ఉన్నతాధికారుల ప్రెజర్​ 

హైదరాబాద్, వెలుగు:  సీఎం బ్రేక్​ఫాస్ట్ స్కీమ్​ను సొంత డబ్బులతో అమలు చేయాల్సిందేనని స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారులు మిడ్​ డే మీల్స్ కార్మికులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇప్పటికే మధ్యాహ్న భోజన బకాయిలతో పాటు వేతన బకాయిలూ కోట్లలో ఉన్నాయి. వాటిని రిలీజ్ చేయకుండా కొత్తగా అదనపు పని చేయడంపై వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్న అప్పులతోనే ఇబ్బందులు పడుతుంటే, కొత్త అప్పులు ఎక్కడికెళ్లి తీసుకురావాలని ప్రశ్నిస్తున్నారు. అయితే, హెడ్మాస్టర్లు పెట్టుకుంటారా? మిడ్​డే మీల్స్ కార్మికులు పెట్టుకుంటారా? అనేది సంబంధం లేదని, కానీ పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ మాత్రం అందించాల్సిందేనని అధికారులు హుకూం జారీ చేస్తున్నారు. ఎన్నికల టైమ్​ కావడంతో స్కీమ్ అమలుపై స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు డీఈవోలపై తీవ్రమైన ఒత్తిడి పెంచుతున్నారు. 

గైడ్​లైన్స్ రిలీజ్​చేయని సర్కారు 

గురువారం (ఈ నెల26) నుంచే సీఎం బ్రేక్​ఫాస్ట్ స్కీమ్​ను స్టార్ట్  చేసేందుకు అధికారులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. అయితే, ఒక్కో స్టూడెంట్​ కు రూ.10.50 పైసల చొప్పున ఇస్తామని, ప్రిపేర్ చేసినందుకు మిడ్​డే మీల్స్ కార్మికులకు రూరల్ లో రూ.2వేలు, అర్బర్ ఏరియాల్లో రూ.వెయ్యి చొప్పున అదనంగా ఇస్తామని ఇటీవల డీఈవోలతో జరిగిన టెలీకాన్ఫరెన్స్ లో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన ప్రకటించారు. కానీ, ఇప్పటి వరకు ఆ వివరాలపై అధికారికంగా గైడ్​లైన్స్​ గానీ, జీవో గానీ రాలేదు. దీంతో అధికారిక ఉత్తర్వులు రాకుండా స్కీమ్ ఎలా అమలు చేయాలని డీఈవోలతో పాటు కిందిస్థాయి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. డీఈవోల ద్వారా ఎంఈవోలు, హెడ్మాస్టర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. 

దీంతో దసరా రోజు కూడా హెడ్మాస్టర్లు, ఎంఈవోలకు ఫోన్లు చేసి మరీ వివరాలు తీసుకున్నారు. అయితే, అధికారిక ఉత్తర్వులు లేకుండా అమలు చేస్తే.. డబ్బులివ్వకపోతే ఎలా అని వారంతా ప్రశ్నిస్తున్నారు. కానీ, దీనికి స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారులు మాత్రం సమాధానం దాటవేస్తున్నట్టు వారు చెప్తున్నారు. స్టేట్ వైడ్​గా 27,147 సర్కారు స్కూళ్లలో టెన్త్ క్లాసు వరకు చదువుతున్న సుమారు 23 లక్షల మంది విద్యార్థులకు ఈ స్కీమ్ అమలు చేయాలని సర్కారు గతంలో నిర్ణయించింది. దీనికి గాను ఈ నెల 6న ‘సీఎం బ్రేక్​ఫాస్ట్’ స్కీమును ప్రభుత్వం ప్రారంభించింది. కానీ అమలు తీరుపై గైడ్​లైన్స్ మాత్రం రిలీజ్ చేయలేదు. 

దశలవారీగా ప్రారంభించాలని సూచన.. 

స్కీమ్ అమలుపై కిందిస్థాయి అధికారుల నుంచి వ్యతిరేకత రావడంతో.. స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారులు కాస్త మెత్తబడ్డారు. అన్ని ఒకేసారి కాకున్నా.. దశలవారీగానైనా ప్రారంభించాలని సూచిస్తున్నారు. గురువారం నుంచి మండలానికి 5 బడుల్లోనైనా ప్రారంభించాలని ఓరల్ ఆదేశాలు ఇస్తున్నారు. పోలింగ్ నాటికి అన్ని బడుల్లో అమలయ్యేలా ప్లాన్ చేసుకోవాలని చెప్తున్నారు. 

ALS0 READ: సమస్యల సాధనకు ఓటు అస్త్రం .. గ్రామాలకు రావొద్దంటూ ఫ్లెక్సీల ఏర్పాటు

అడ్వాన్స్ ఇస్తేనే ఆలోచిస్తం 

గైడ్​లైన్స్ లేకుండా మిడ్​డే మీల్స్ వర్కర్స్ బ్రేక్ ఫాస్ట్ పెట్టాలని అధికారులు ఒత్తిడి తీసుకురావడం సరికాదు. స్కీమ్ అమలుకు జీవోతో పాటు అడ్వాన్స్ ఇవ్వాలి. అప్పుడు బ్రేక్ ఫాస్ట్ అమలుపై ఆలోచిస్తాం. మిడ్ ​డే మీల్స్ బకాయిలే కోట్లలో ఉన్నాయి. వాటిని ముందు రిలీజ్ చేయాలి.  
‑ ఎస్వీ రమ, మిడ్​డే మీల్స్  కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి