
- బీజేపీ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ కావాలనే పద్మ అవార్డులపై రాజకీయం చేస్తోందని, లేనిపోని అవాకులు, చెవాకులు పేలుతోందని బీజేపీ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని తెలిపారు. ఇచ్చిన హామీల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు పద్మ అవార్డుల మీద కాంగ్రెస్ రచ్చ చేస్తోందని ఆరోపించారు. సామాజిక సేవలను గుర్తించే భారత ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించిందని చెప్పారు.
గతంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గుస్సాడి కనకరాజును గుర్తించి కేంద్రం పద్మ అవార్డును ప్రకటించిందని, కనకరాజు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదని గుర్తుచేశారు. పద్మ అవార్డుల ప్రకటనలో ఎలాంటి రాజకీయం ఉండబోదని పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ మానుకొని, ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని సూచించారు. గద్దర్ కు తాము వ్యతిరేకం కాదని, వ్యక్తిగతంగా దూషణలు చేయలేదని కానీ, ఆయన ఎంచుకున్న మార్గాన్ని తప్పని మాత్రమే చెప్పామని వెల్లడించారు.