కోర్టా చనాఖ పనులకు నిధులు విడుదల చేయాలి : పాయల్ శంకర్

ఆదిలాబాద్, వెలుగు: కోర్టా చనాఖ ప్రాజెక్టు పనులు పూర్తిచేసేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రాజెక్టు పనులను బుధవారం ఆయన పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న కమీషన్ల కక్కుర్తి కారణంగానే ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదని ఆరోపించారు. పనులు అలస్యమవడంతో నిర్మాణ వ్యయం పెరిగిందన్నారు.

సేకరించాల్సిన భూముల విలువ పెరిగి రైతులకు గిట్టుబాటుకాక రిజర్వాయర్ కోసం భూములు ఇవ్వడం లేదన్నారు. భూములు ఇచ్చిన నిర్వాసితులకు పరిహారం, డబుల్ బెడ్రూం ఇండ్లు అందక రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. ఈ విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లామని, ఆయా శాఖ మంత్రులు సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ జిల్లా నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, వేదవ్యాస్. సంతోష్,  గొర్ల రాము తదితరులున్నారు.

కొలాం పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే 

జిల్లా కేంద్రంలోని కొలాం గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే సందర్శించారు. చలి తీవ్రంగా ఉండే ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్థులకు కనీస వసతులు కల్పించడం లేదన్నారు. దుప్పట్లు, స్వెటర్లు, పుస్తకాలు వంటివి కూడా అందించలేదన్నారు. ప్రస్తుతం జిల్లాకు ఇన్​చార్జి మంత్రిగా ఉన్న సీతక్క స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.