ఆదిలాద్టౌన్, వెలుగు: తెలంగాణలో డిసెంబర్3న బీజేపీ అధికారంలోకి వస్తుందని పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ధీమా వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జనగర్జన సభ విజయవంతమైన సందర్భంగా బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొట్టమొదటి బీజేపీ సభ ఆదిలాబాద్ గడ్డపై నిర్వహించి ఎన్నికల శంఖారావం పూరించిందన్నారు.
సభకు వచ్చిన జనం, కార్యకర్తలో ఉత్సాహం చూస్తే ఎమ్మెల్యే జోగు రామన్న అంతం మొదలైందన్నట్లుకనిపించిందని పేర్కొన్నారు. వారం రోజులుగా కార్యకర్తలు, నాయకులు శ్రమించి సభను ఘనంగా నిర్వహించినందుకు ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి, జిల్లా నాయకులు ఆకుల ప్రవీణ్, వేద వ్యాస్, ముకుందరావు, కృష్ణ, రఘుపతి, గొర్ల రాము తదితరులు పాల్గొన్నారు.