ఆదిలాబాద్ టౌన్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ అన్నారు. ప్రభుత్వంపై బీజేపీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకొని స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. కేంద్రం అందించే అభివృద్ధి పనులకు, పథకాలకు రంగులు అద్ది తమ పథకాలుగా చెప్పుకుంటూ వస్తోందని ఆరోపించారు. మోసపూరిత ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్నారు. జడ్పీ మాజీ చైర్పర్సన్సుహాసినీరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి లోక్ ప్రవీణ్ రెడ్డి, నాయకులు జోగు రవి, రత్నాకర్ రెడ్డి, చిలుకూరు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
విఠల్ రెడ్డి ఇంటి ముట్టడి
భైంసా: బీసీ బంధును వెనుకబడిన తరగతుల వారందరికీ వర్తింపజేయాలనే డిమాండ్‌తో బీజేపీ శ్రేణులు ముథోల్ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఇంటి ముట్టడికి ప్రత్నించారు. బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, పట్టణ అధ్యక్షుడు మల్లేశ్వర్ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భైంసా మండలం దేగాం గ్రామంలోని ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి తరలివెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. రమాదేవిని హౌజ్అరెస్టు చేశారు. పట్టణ అధ్యక్షులు మల్లేశ్వర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే నివాసం వద్దకు చేరుకొని ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించారు.