అంగన్వాడీల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి: పాయల్ శంకర్

ఆదిలాబాద్, వెలుగు: అంగన్వాడీల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ అన్నారు. కలెక్టరేట్ ఎదుట సమ్మె చేస్తున్న అంగన్వాడీలతో పాటు ఆశా వర్కర్లకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలో అంగన్వాడీల సేవలు వినియోగించుకుంటున్నారని, అలాంటి వారికి కనీస వేతనాలు అందించకుండా రాక్షస పాలన సాగిస్తోందని మండిపడ్డారు. 

ఆశా వర్కర్ల సేవలు ఎనలేనివి, కరోనా కష్టకాలంలో సైతం ఎంతో కృషి చేశారన్నారు. వీరి సేవలను ప్రభుత్వం గుర్తించకపోవడం దురదృష్టకరమన్నారు. అనంతరం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దినేశ్ మాటోలియా, ముకుందరావు, మేస్త్రం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.