అధికారులకు తెలియకుండానే పెండింగ్ ​బిల్లుల చెల్లింపు!

  • 11 పనులకు రూ.15 లక్షలు చెల్లింపు
  • తనకు తెలియకుండా చెల్లించారని కలెక్టర్​కు స్పెషలాఫీసర్ ఫిర్యాదు ​
  • 'డిజిటల్​సిగ్నీచర్​కీ' బ్లాక్ ​చేసిన వైనం
  • విచారణకు ఆదేశం..?

యాదాద్రి, వెలుగు : చేసిన పనులను పరిశీలించకుండానే డిజిటల్ సిగ్నీచర్ కీ (డీఎస్​కే)తో పెండింగ్​లో ఉన్న బిల్లులను చెల్లించేశారు. అది కూడా మండల స్పెషలాఫీసర్​కు తెలియకుండా చెల్లింపులు జరిగాయి. దీంతో అప్రమత్తమైన స్పెషలాఫీసర్​ కలెక్టర్​కు ఫిర్యాదు చేయడంతో డీఎస్​కేను బ్లాక్​చేయించారు. 

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

ఎంపీపీల పదవీకాలం ముగియడంతో జిల్లాలోని 17 మండలాలకు ప్రభుత్వం స్పెషలాఫీసర్లను నియమించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే సంస్థాన్​నారాయణపురం మండలానికి స్పెషలాఫీసర్​గా ఎస్సీ వెల్ఫేర్​ఆఫీసర్​ జైపాల్​రెడ్డిని నియమించారు. ఎంపీడీవోగా కుమార్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో వీరిద్దరికి నిర్వహణతోపాటు బిల్లుల చెల్లింపుల కోసం డిజిటల్​సిగ్నీచర్​కీ (డీఎస్​కే)ని 'ఈ ముద్ర' ద్వారా డీపీవో ఆఫీసులోని రాజు రూపొందించారు. ఎంపీడీవో ఆఫీసులో సీనియర్​అసిస్టెంట్​నాగరాజుకు అందించినట్టుగా తేలింది. 

అయితే స్పెషలాఫీసర్​జైపాల్​రెడ్డికి చెందిన డీఎస్​కేను ఆయనకు కాకుండా వేరే వ్యక్తికి అందించినట్టుగా తెలుస్తోంది. కాగా 15వ ఆర్థిక సంఘం ద్వారా చేపట్టిన పనులకు సంబంధించిన పలు బిల్లులు పెండింగ్​లో ఉన్నాయి.  పెండింగ్​లో ఉన్న బిల్లుల్లో 11 పనులకు సంబంధించిన రూ.15 లక్షల వరకు చెల్లింపులు జరిగాయి. పనులు తాను పరిశీలించకపోవడం, తనకు డీఎస్​కే ఇవ్వకున్నా బిల్లుల చెల్లింపులకు సంబంధించిన ఓటీపీ మెసేజ్​లు తన ఫోన్ కు రావడంతో జైపాల్​రెడ్డి అలర్ట్ అయ్యారు. తనకు డీఎస్​కే ఇవ్వకున్నా బిల్లులు చెల్లింపులు ఎలా అవుతున్నాయని ఆరా తీశారు. 

తన మెయిల్ పాస్​వర్డ్ మార్చడం ద్వారా వచ్చిన ఓటీపీని ఉపయోగించి బిల్లులను డ్రా చేసినట్టుగా గుర్తించారు. దీంతో తన డీఎస్​కేను దుర్వినియోగం చేసి బిల్లులు డ్రా చేసుకున్నారని, దాన్ని బ్లాక్​ చేయించాలని కలెక్టర్​హనుమంతు జెండగేకు జైపాల్​రెడ్డి ఫిర్యాదు చేశారు. తన అనుమతి లేకుండా బిల్లులు చెల్లింపులు చేయడంపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో జైపాల్​రెడ్డి డీఎస్​కేను డీపీవో సునంద బ్లాక్​ చేయించారు. కాగా ఈ డీఎస్​కే ఇవ్వకుండా జరిగిన ఈ చెల్లింపులపై విచారణకు ఆదేశించినట్టుగా సమాచారం.  

డీఎస్​కే రూపొందించడం ఇలా..

మండలాలకు సంబంధించిన నిధుల వినియోగం, బిల్లుల చెల్లింపు బాధ్యత స్పెషలాఫీసర్లతో పాటు ఎంపీడీవోలకు అప్పగించింది. దీనికి సంబంధించి 'ఈ ముద్ర' ద్వారా ప్రతీ మండలానికి చెందిన ఇద్దరు ఆఫీసర్ల ఆధార్, పాన్​, ఫొటో, ఈ–మెయిల్, ఫోన్ నంబర్లు తీసుకోవడంతోపాటు వీడియో కాల్​ద్వారా వారిని నిర్ధారణ చేసుకొని డీఎస్​కే (డిజిటల్ సిగ్నీచర్​కీ) రూపొందిస్తారు. బిల్లుల చెల్లింపు సమయంలో ఇద్దరు ఆఫీసర్లు కలిసి డీఎస్​కే ద్వారా బిల్లులు చెల్లించవచ్చు. ఒకరు లేకున్నా సంబంధిత ఆఫీసర్​ఫోన్, ఈ–మెయిల్​కు వచ్చే ఓటీపీని సబ్మిట్ చేసినట్టయితే బిల్లులను చెల్లించే అవకాశం ఉంటుంది.