టెక్నాలజీ : పేమెంట్‌ ప్రైవసీ..ఈ టిప్స్ ఫాలో అయితే సైబర్​ మోసగాళ్ల వలలో చిక్కుకోకుండా ఉండొచ్చు

టెక్నాలజీ : పేమెంట్‌ ప్రైవసీ..ఈ టిప్స్ ఫాలో అయితే సైబర్​ మోసగాళ్ల వలలో చిక్కుకోకుండా ఉండొచ్చు

ఆన్​లైన్ పేమెంట్స్ వచ్చాక పది రూపాయల వస్తువు కొన్నా, ఆన్​లైన్​లో డబ్బు కడుతున్నారు.  అలాంటి పేమెంట్స్​లో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్​ ఇంటర్​ఫేస్) ఒకటి. ఇలా పే చేయడం ఎంత ఈజీ అయిందో అంతే ఈజీగా ఆన్​లైన్​ మోసాలు కూడా పెరిగిపోయాయి. వాటిని అరికట్టడానికే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్​ ఇండియా (ఎన్​పిసిఐ) పేమెంట్ సిస్టమ్​లో మార్పులు చేసింది. అయినా కూడా స్కామ్​లు జరుగుతూనే ఉన్నాయి.

వాటికి  చెక్​ పెట్టేందుకే ఒకసారి యూపీఐ పేమెంట్ 2 వేలకంటే ఎక్కువ మొత్తంలో ట్రాన్స్​ఫర్ చేశాక రెండో పేమెంట్​కి నాలుగ్గంటల టైం లిమిట్​ ఉండాలని​ చెప్పింది గవర్నమెంట్. ఇదంతా ఓకే కానీ అసలు ఈ సైబర్ మోసాలు ఎప్పుడు? ఎలా? జరుగుతాయో తెలియదు. అందుకని కొన్ని టిప్స్ ఫాలో అయితే సైబర్​ మోసగాళ్ల వలలో చిక్కుకోకుండా ఉండొచ్చు. అవేంటంటే...

యూపీఐ పిన్ అవసరం లేదు

ఎన్​సిపిఐ ప్రకారం, క్యూఆర్​ కోడ్​లను స్కాన్​ చేస్తే పేమెంట్స్ చేయొచ్చు. కానీ రిసీవ్​ చేసుకోలేరు. కాబట్టి ఎవరైనా ‘మీకు డబ్బులు పంపిస్తాం. క్యూఆర్​ కోడ్​ స్కాన్ చేయండి’ అని అడిగితే అది మోసం అని గుర్తించాలి. అలాగే, యూపీఐ పిన్​ కూడా డబ్బులు పంపేందుకు వాడతారే కానీ, రిసీవ్​ చేసుకునేందుకు కాదు. అందుకని డబ్బులు పంపేందుకు యూపీఐ పిన్ ఎవరైనా అడిగితే అది మోసం. 

చాలా అరుదుగా ఒక ట్రిక్​ ఉపయోగిస్తుంటారు. అదేంటంటే... యాప్​ని డౌన్​లోడ్ చేసుకోమని అడగడం. అలాకానీ యాప్​ డౌన్​లోడ్​ చేసుకుంటే ఆ యాప్​లో అవతలి వాళ్లు యూపీఐ పిన్ ఎంటర్​ చేసి, మీ బ్యాంక్​ అకౌంట్​ ఖాళీ చేస్తారు. అందుకని పేమెంట్​ చేయకముందే ఆ పేమెంట్​ యాప్​కి ప్రామాణికత ఉందా? లేదా? అనేది తెలుసుకోవాలి. యూపీఐ పిన్​ని యాప్​  పిన్​ పేజీలో మాత్రమే ఎంటర్​ చేయాలే తప్ప ఎక్కడంటే అక్కడ కాదు.

రిసీవర్​ పేరు చెక్ చేయాలి

చాలామంది ఎవరికి డబ్బు పంపుతున్నారో పేరు చూడకుండా పేమెంట్ చేస్తుంటారు. ఎప్పుడూ అలా చేయొద్దు. ఎందుకంటే షాప్​కి వెళ్లినప్పుడు అక్కడ మల్టిపుల్ క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. అలాంటప్పుడు స్కాన్​ చేసే ముందు ఆ షాపు యజమానిని అడగాలి. పేరు చెక్​ చేసుకోవాలి. ఆ తర్వాతే పేమెంట్ చేయాలి. 

స్క్రీన్ షేరింగ్ యాప్స్ వద్దు

స్క్రీన్ షేరింగ్ యాప్స్ ద్వారా బ్యాంక్ సమాచారం, లాగిన్ క్రెడిన్షియల్స్, కార్డ్ నెంబర్స్ వంటివి దొంగిలించే ప్రమాదం ఉంది. ప్రస్తుతం కామన్​గా జరుగుతున్న స్కామ్ ఇది. మీకు తెలియకుండానే స్క్రీన్​ షేరింగ్, మెసేజ్ ఫార్వార్డింగ్ యాప్స్ అంటూ మెసేజ్​లు ఏవైనా వస్తే కనుక... అదేంటి? ఎందుకు డివైజ్​కి యాక్సెస్ చేయాలి అనుకుంటున్నారు? అనే విషయాలు అడగాలి.

అలాగే బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే... ఓటీపీ, కాన్ఫి​డెన్షియల్ డిటెయిల్స్ గురించి ఏ ఆర్గనైజేషన్ అడగదు. అందుకనే స్క్రీన్ షేరింగ్ యాప్స్, తెలియని యాప్స్ ఇన్​స్టాల్ చేసుకోమని ఎవరైనా చెప్తే చేసుకోవద్దు.