జనగామ జిల్లాలో ఫాస్ట్​గా ప్యాడీ పైసలు

జనగామ జిల్లాలో ఫాస్ట్​గా ప్యాడీ పైసలు
  • సన్నాలకు బోనస్ ​చెల్లింపులూ స్పీడ్​గానే.. 
  • చివరిదశకు ధాన్యం కొనుగోళ్లు
  • జనగామ జిల్లాలో సేకరించిన వడ్లు 78,891 మెట్రిక్​టన్నులు

జనగామ, వెలుగు : జనగామ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల డబ్బుల చెల్లింపులు ఫాస్ట్​గా జరుగుతున్నాయి. సెంటర్ల నిర్వాహకులు వివరాలు ఆన్లైన్​చేసిన రెండు, మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమవుతున్నాయి. యాసంగి పనులు స్పీడందుకుంటున్న టైంలో డబ్బులు చేతికి అందుతుండగా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో ఇప్పటి వరకు 17,446 మంది రైతుల వద్ద కొనుగోళ్లు చేపట్టగా, 16,490 మందికి పేమెంట్లు చేశారు. రూ.3 లక్షలకు పైన డబ్బులు రావాల్సి ఉన్న రైతులకు సంబంధించి సదరు సెంటర్​నిర్వాహకులు మరోసారి ఆరాతీసి చెల్లింపులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.

78 వేల మెట్రిక్​టన్నుల కొనుగోళ్లు 

జిల్లాలో వానాకాలం సీజన్​లో 2 లక్షల 5 వేల మెట్రిక్​ టన్నుల ధాన్యం సేకరణ టార్గెట్​గా పెట్టుకున్న ఆఫీసర్లు 180 సెంటర్లను ఏర్పాటు చేశారు. దసరా నుంచి కొనుగోళ్లు స్టార్ట్​చేసి ఇప్పటి వరకు 78,891 మెట్రిక్​టన్నుల ధాన్యాన్ని కొన్నారు. ఇందులో 59,599 మెట్రిక్​టన్నులు దొడ్డురకం, 19,292 మెట్రిక్​టన్నులు సన్నరకంగా ఉన్నాయి. కొనుగోళ్ల ప్రక్రియ చివరి దశకు చేరింది. మరో 5 వేల మెట్రిక్​టన్నుల ధాన్యం రానున్నట్లు అంచనాలు వేస్తున్నారు.

Also Read : ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సర్వే షురూ 

గత వానాకాలం సీజన్​లో 80 వేల మెట్రిక్​టన్నుల ధాన్యం కొనగా, ఈ సారి దానికంటే కొంత ఎక్కువ జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రైవేటులోనూ మిల్లర్లు, వ్యాపారులు ప్రభుత్వ మద్దతు ధరకు ధీటుగా క్వింటాలుకు రూ.2 వేల నుంచి రూ.2,350 వరకు ధర పెట్టారు. దీంతో రైతులు ప్రైవేటు వ్యక్తులకు అమ్మకాలు చేయడంతో సర్కారు సెంటర్ల లక్ష్యం తగ్గినట్లు తెలుస్తోంది. 

రూ.168 కోట్ల చెల్లింపులు..

జిల్లాలో 17,446 మంది రైతులకు రూ.183 కోట్లు ధాన్యం డబ్బులు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 16,490 మందికి రూ.168 కోట్ల చెల్లింపులు జరిగాయి. వీరిలో 4,770 మంది సన్నరకం ధాన్యం రైతులుండగా, 12,676 మంది దొడ్డురకం రైతులున్నారు. ఇంకా 956 మందికి రూ.14 కోట్ల వరకు పేమెంట్​చేయాల్సి ఉంది. జిల్లాలో సన్నరకం 12,756 మెట్రిక్​ టన్నులకు గాను 3,285 మంది రైతులకు రూ 6.38 కోట్లు బోనస్​డబ్బులు చెల్లించారు. మరో 1,485 మంది రైతులకు బోనస్ జమకావాల్సి ఉంది. ​ ​

స్పీడ్​గా చెల్లింపులు..

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు 17,446 మంది రైతుల వద్ద కొన్నాం. వీరిలో 16,490 మందికి పేమెంట్లు జరిగాయి. సెంటర్ల నిర్వాహకులు వివరాలు ఆన్​లైన్ చేసిన రెండు రోజుల్లో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు చేపడుతున్నం.​ 

- వీ.హథీరామ్, సివిల్ సప్లై డీఎం, జనగామ