- కొత్త లిస్ట్ రిలీజ్ చేసిన సంస్థ
ఢిల్లీ: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున టోల్ వసూలు చేసే ఐహెచ్ఎంసీఎల్ ఫాస్టాగ్ కు భారీ షాక్ ఇచ్చింది. ఫాస్టాగ్ జారీ చేసే అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ను తొలగించింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం కొనసాగించటం కోసం తాము పేర్కొన్న బ్యాంకుల నుంచే ఫాస్టాగ్‌లు కొనుగోలు చేయాలని యూజర్లకు సూచించింది. ఐహెచ్‌ఎంసీఎల్ పేర్కొన్న జాబితాలో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్‌బీఐ, యెస్ బ్యాంక్ సహా మొత్తం 32 బ్యాంకులు ఉన్నాయి. దాంట్లో పీపీబీఎల్ మాత్రం లేదు.
ఫిబ్రవరి 29 తర్వాత వినియోగదారుల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్‌లలో డిపాజిట్లు, టాప్-అప్‌లు స్వీకరించొద్దని పీపీబీఎల్‌ను ఆర్‌బీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ఆయా ఖాతాల్లో ఇప్పటి వరకు ఉన్న సొమ్మును అయిపోయేంత వరకు ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలోనే ఐహెచ్‌ఎంసీఎల్ తాజా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఫాస్టాగ్ యూజర్లంతా ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం తమ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని ఐహెచ్‌ఎంసీఎల్ సూచించింది.