పంజాబ్‌‌కు తొలి దెబ్బ.. 50 రన్స్ తేడాతో గెలిచిన రాజస్తాన్‌‌ రాయల్స్‌

పంజాబ్‌‌కు తొలి దెబ్బ..  50 రన్స్ తేడాతో గెలిచిన రాజస్తాన్‌‌ రాయల్స్‌
  • రాణించిన జైస్వాల్‌‌, ఆర్చర్‌‌‌‌

ముల్లన్‌‌పూర్‌‌‌‌: వరుసగా రెండు విజయాలతో జోరుమీదున్న పంజాబ్ కింగ్స్‌‌కు ఐపీఎల్‌‌18లో తొలి దెబ్బ తగిలింది. బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్ (45 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 67) .. బౌలింగ్‌లో జోఫ్రా​ఆర్చర్‌‌ (3/25) విజృంభించడంతో రాజస్తాన్‌‌ రాయల్స్‌‌ శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌‌లో  50  రన్స్ తేడాతో పంజాబ్‌‌ను చిత్తు చేసి రెండో విజయం అందుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌‌కు వచ్చిన రాయల్స్‌‌ నిర్ణీత 20 ఓవర్లలో 205/4 స్కోరు చేసింది. ఫిఫ్టీతో ఫామ్‌‌లోకి వచ్చిన జైస్వాల్‌.. కెప్టెన్ సంజూ శాంసన్ (26 బాల్స్‌‌లో 6 ఫోర్లతో 38) తొలి వికెట్‌‌కు 89 రన్స్ జోడించి బలమైన పునాది వేశాడు. 

లోకీ ఫెర్గూసన్‌‌ ఈ ఇద్దరినీ వరుస ఓవర్లలో ఔట్ చేయగా.. యాన్సెన్ బౌలింగ్‌‌లో నితీష్ రాణా (12) ఔటవడంతో పంజాబ్ బౌలర్లు రేసులోకి వచ్చారు. కానీ, రియాన్ పరాగ్‌‌ (25 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 43 నాటౌట్‌‌) దూకుడు చూపెట్టాడు. షిమ్రన్ హెట్‌‌మయర్ (20)తో  నాలుగో వికెట్‌‌కు 47 రన్స్ జోడించిన పరాగ్‌‌.. చివర్లో ధ్రువ్‌‌ జురెల్ (13 నాటౌట్‌‌) తోడుగా స్కోరు 200 మార్కు దాటించాడు. భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో పంజాబ్ కింగ్స్‌‌  20 ఓవర్లలో 155/9 స్కోరు చేసి ఓడింది.  

నేహల్ వాధెర (41 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 62) ఒంటరి పోరాటం చేశాడు. ఇన్నింగ్స్‌‌ ఫస్ట్ బాల్‌‌కే ప్రియాన్ష్ ఆర్య (0), ఆరో బాల్‌‌కు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (10)ను బౌల్డ్‌‌ చేసిన జోఫ్రా​ ఆర్చర్‌‌ ఆదిలోనే కింగ్స్‌‌ను భారీ దెబ్బకొట్టాడు.  ప్రభ్‌‌సిమ్రన్‌‌ సింగ్ (17), మార్కస్ స్టోయినిస్ (1) కూడా నిరాశపరచడంతో ఓ దశలో పంజాబ్ 43/4తో నిలిచింది. ఈ టైమ్‌‌లో వాధెర, మ్యాక్స్‌‌వెల్ (30) ఐదో వికెట్‌‌కు 88 రన్స్‌‌ జోడించి జట్టును రేసులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ, రాయల్స్ స్పిన్నర్లు మహేశ్ తీక్షణ, హసరంగ వరుస బాల్స్‌‌లో ఈ ఇద్దరినీ ఔట్‌‌ చేయడంతో పంజాబ్ ఓటమి ఖాయమైంది.  ఆర్చర్‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

సంక్షిప్త స్కోర్లు

రాజస్తాన్‌‌: 20 ఓవర్లలో 205/4 (జైస్వాల్ 67, పరాగ్ 43*, ఫెర్గూసన్ 2/37)
పంజాబ్‌‌: 20 ఓవర్లలో 155/9  (నేహల్ 62, మ్యాక్స్‌‌వెల్ 30,  ఆర్చర్‌‌‌‌ 3/25)