PBKS vs RR: లో స్కోర్ థ్రిల్లర్.. పంజాబ్‌‌పై రాజస్థాన్ విజయం

PBKS vs RR: లో స్కోర్ థ్రిల్లర్.. పంజాబ్‌‌పై రాజస్థాన్ విజయం

ముల్లన్‌పూర్ వేదికగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆఖరివరకూ హోరీహోరీగా సాగింది. చేసింది తక్కువ పరుగులే అయినా.. గెలుపు కోసం పంజాబ్ బౌలర్లు శక్తికి మించి పోరాడారు. కట్టుదిట్టంగా బంతులేస్తూ మ్యాచ్‌ను ఆఖరి ఓవర్ వరకూ తీసుకొచ్చారు. ఫలితం వ్యతిరేకంగా వచ్చినా.. ఈ మ్యాచ్‌లో వారి పోరాటాన్ని మెచ్చుకోవలసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 147 పరుగులు చేయగా.. రాయల్స్ బ్యాటర్లు ఒక బంతి మిగిలివుండగా లక్ష్యాన్ని చేధించారు.

స్వల్ప ఛేద‌న‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు మంచి ఆరంభం లభించింది. ఓపెన‌ర్లు త‌నుష్ కొటియన్(24; 31 బంతుల్లో 3 ఫోర్లు), య‌శ‌స్వీ జైస్వాల్(39; 28 బంతుల్లో 4 ఫోర్లు)లు తొలి వికెట్ కు 56 పరుగులు జోడించారు. పంజాబ్ పేస‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంలో వీరిద్దరూ బౌండరీలు రాబట్టలేకపోయారు. ఆపై వచ్చిన బ్యాటర్లు వేగంగా ఆడలేకపోయారు. ఒకవైపు పరుగులు రావడం ఇబ్బందిగా మారడం.. మరోవైపు శాంసన్(18) స్వల్ప స్కోరుకే ఔట్ అవ్వడంతో మ్యాచ్ ఆసక్తి రేకెత్తిచింది. 

గెలిపించిన హెట్మెయర్

చివరలో రాజస్థాన్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ పంజాబ్ వైపు మళ్లింది. ఆఖరి ఓవర్ లో విజయానికి 10 పరుగులు అవసరం కాగా, అర్షదీప్ సింగ్ మొదటి రెండు బంతులకు పరుగులు ఏమీ ఇవ్వలేదు. అప్పటివరకూ మ్యాచ్ పంజాబ్ చేతుల్లోనే ఉంది. ఆ సమయంలో విండీస్ హిట్టర్ షిమ్రాన్ హెట్మెయర్(27 నాటౌట్; 10 బంతుల్లో ఒక ఫోర్, 3 సిక్స్ లు) తన సత్తా ఏంటో చూపెట్టాడు. 6, 2, 6.. బాది మరో బంతి మిగిలివుండగానే మ్యాచ్ ముగించాడు.

 
అంతుకుముందు జితేశ్ శ‌ర్మ‌(29), లివింగ్‌స్టోన్‌(21), అశుతోష్ శ‌ర్మ‌(31) రాణించడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 కోల్పోయి 144 పరుగులు చేసింది. రాయల్స్ బౌలర్లలో కేశవ్ మహారాజ్, అవేష్ ఖాన్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. 

 

ఈ విజయంతో రాజస్థాన్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. ఓటమితో పంజాబ్ కింగ్స్ ఎనిమిదో స్థానంలోనే కొనసాగుతోంది. ఆడిన 6 మ్యాచ్‌ల్లో పంజాబ్ కిది నాలుగో ఓటమి.