183 పరుగుల భారీ ఛేదనలో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు తడబడుతున్నారు. హైదరాబాద్ పేసర్లు భువనేశ్వర్ కుమార్, పాట్ కమ్మిన్స్ నిప్పులు చెరుగుతుండడంతో పంజాబ్ స్వల్ప వ్యవధిలోనే 3 వికెట్లు కోల్పోయింది. భువీ వేసిన మొదటి ఓవర్‌లో ఒక ఒక్క పరుగు రాగా.. రెండో ఓవర్‌లో కమిన్స్.. ప్రమాదకర జానీ బెయిర్‌స్టో(0) క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే భువనేశ్వర్.. ఇంపాక్ట్ ప్లేయర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్(4)ను వెనక్కి పంపాడు. దీంతో పంజాబ్ తొలి మూడు ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయింది.
అనంతరం ధాటిగా ఆడే ప్రయత్నంలో శిఖర్ ధావన్(14) క్లాసెన్ చేతిలో స్టంపౌట్ అయ్యాడు. వికెట్ల వెనుక బంతిని అందుకున్న క్లాసెన్ రెప్పపాటులో వికెట్లను గిరాటేశాడు. దీంతో పంజాబ్ 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం పంజాబ్ స్కోర్.. 7 ఓవర్లకు 40/3. సామ్ కరన్(13), సికిందర్ రజా(8) క్రీజులో ఉన్నారు.
అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ 182 పరుగుల భారీ స్కోర్ కొట్టింది. టాపార్డర్ బ్యాటర్లంతా తడబడిన చోట వైజాగ్ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి(64) తన సుడిగాలి ఇన్నింగ్స్ తో జట్టును గట్టెక్కించాడు. ఐపీఎల్‌లో తొలి హాఫ్ సెంచరీ బాది జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. అతనికి తోడుగా ఆఖరిలో అబ్దుల్ సమద్(25), షహ్‌బాజ్ అహ్మద్(14) విలువైన పరుగులు చేశారు.