పాక్ క్రికెట్‌ బోర్డు చెత్త నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్‌గా రబ్బిష్ బౌలర్

పాక్ క్రికెట్‌ బోర్డు చెత్త నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్‌గా రబ్బిష్ బౌలర్

వన్డే ప్రపంచ కప్ 2023 ఓటములు పాకిస్తాన్ క్రికెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ బాధలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటూ పాక్ క్రికెట్ జట్టును శాశ్వతంగా కనుమరుగు చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే విదేశీయులను జట్టు బాధ్యతల నుంచి పూర్తిగా తప్పించిన పీసీబీ..వాటిని స్వదేశీయులకు కట్టబెడుతోంది. ఈ క్రమంలో కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటోంది.    

పాకిస్తాన్ జాతీయ జట్టు చీఫ్ సెలెక్టర్‌గా క్రీడా మంత్రి, మాజీ లెఫ్టార్మ్ పేసర్ వహాబ్ రియాజ్ ఎన్నికయ్యాడు. ఈ మేరకు పీసీబీ సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది.

ఈ మాజీ పేసర్ రాణించక పోవడంతో రెండేళ్ల క్రితం జట్టు నుంచి తప్పించారు. అనంతరం జట్టులోకి వచ్చే అవకాశం లేకపోవడంతో 2023లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయాల్లో చేరిపోయాడు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కూలిపోయాక.. వహాబ్ పంజాబ్ ప్రావిన్స్‌లోని తాత్కాలిక క్యాబినెట్‌లో క్రీడా మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. అలాంటి ఒక విఫలమైన బౌలర్‌ని తీసుకొచ్చి చీఫ్ చీఫ్ సెలెక్టర్‌గా నియమించడం అంటే కాస్త వింతగానే ఉంది.

 చీఫ్ సెలెక్టర్‌గా నియమించినందుకు పీసీబీ ఛైర్మన్ జాకా అష్రాఫ్‌కు రియాజ్ కృతజ్ఞతలు తెలిపాడు. తనపై నమ్మకం ఉంచి అప్పగించిన ఛాలెంజింగ్ టాస్క్ కు న్యాయం చేస్తానని మాటిచ్చాడు. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం పాకిస్తాన్ జట్టు త్వరలోనే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ జట్టుకు ఆటగాళ్లను ఎంపిక చేయడమే రియాజ్‌ మొదటి పని.

పాకిస్థాన్ తరఫున 2008లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వహాబ్ రియాజ్..  91 వన్డేలు, 27 టెస్టులు, 36 టీ20లు ఆడాడు. ఈ  మూడు ఫార్మాట్లలో కలిపి 241 వికెట్లు పడగొట్టాడు. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన పాకిస్థాన్ జట్టులో వహాబ్ సభ్యుడు.