Pakistan Cricket: పాక్ క్రికెట్‌లో మరో రచ్చ.. PCB చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజీనామా

Pakistan Cricket: పాక్ క్రికెట్‌లో మరో రచ్చ.. PCB చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజీనామా

పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ఇహ్సానుల్లా గాయం పట్ల అలసత్వం వహించిన పట్ల క్రికెట్ బోర్డు(పిసిబి) చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సోహైల్ సలీమ్‌పై వేటు పడింది. సమయానికి జీతం, ఇతర అలవెన్సులు తీసుకోవడంలో శ్రద్ధ చూపిన డాక్టర్ సోహైల్.. జాతీయ జట్టు ఆటగాడి గాయం పట్ల కనీస శ్రద్ధ చూపలేదు. దీంతో టీ20 ప్రపంచ కప్ 2024 జట్టులో ఉండాల్సిన అతను జట్టుకు దూరమయ్యాడు.   

అసలేం జరిగిందంటే..?

ఏప్రిల్ 2023లో న్యూజిలాండ్‌తో జరిగిన వైట్-బాల్ సిరీస్ సందర్భంగా ఇహ్సానుల్లా మోచేయికి గాయమైంది. అప్పటి నుండి అతను ఆటకు దూరంగా ఉంటున్నాడు. 12 నెలలు గడిచినా అతని గాయంపై స్పష్టత రాకపోవడంతో ధర్యాప్తు చేసేందుకు పీసీబీ ఇటీవల.. రాణా దిలావైజ్ నదీమ్, ముమ్రైజ్ నక్ష్‌బంద్, జావేద్ అక్రమ్‌లతో కూడిన స్వతంత్ర త్రిసభ్య వైద్య కమిటీని నియమించింది. 

ఈ కమిటీ ఇహ్సానుల్లా పరిస్థితిని పరిష్కరించలేదని, అతనికి అవసరమైన శస్త్రచికిత్స చేయలేదని నిర్ధారించింది. క్లినికల్ డయాగ్నసిస్, ఇన్వెస్టిగేషన్‌ చేరుకోవడంలో జాప్యం జరిగినట్లు.. పరిస్థితి ప్రకారం అధికారిక పునరావాస ప్రక్రియ అందించలేదని గుర్తించింది. ఇప్పటివరకూ అతనికి అందిన ట్రీట్‌మెంట్, ఆపరేషన్ ఏదీ సరైనది కాదని.. అందుకు భాద్యుడు పిసిబి చీఫ్ మెడికల్ ఆఫీసర్ అని నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక బయటకొచ్చిన గంటల వ్యవధిలోనే డాక్టర్ సోహైల్ సలీమ్ తన రాజీనామాను సమర్పించారు.

12 నెలల్లో కోలుకోకపోతే..

అంతేకాకుండా, కమిటీ 21 ఏళ్ల ఫాస్ట్ బౌలరైన ఇహ్సానుల్లాకు ఫిజియోథెరపీ, పునరావాసం తప్పనిసరని సూచించింది. అతను 6 నుండి 12 నెలల్లో కోలుకోకపోతే శస్త్రచికిత్స చివరి ప్రయత్నం అని పేర్కొంది.