Women's T20 World Cup 2024: తండ్రి మరణం.. ఆసీస్‌తో కీలక పోరుకు పాకిస్థాన్ కెప్టెన్ దూరం

Women's T20 World Cup 2024: తండ్రి మరణం.. ఆసీస్‌తో కీలక పోరుకు పాకిస్థాన్ కెప్టెన్ దూరం

పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా కుటుంబలో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి మరణించాడు. దీంతో సనా గురువారం (అక్టోబర్ 10) తన దేశం బయలుదేరనుంది. ఫాతిమా సనా గురువారం తిరిగి కరాచీకి వెళ్లనున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ధృవీకరించింది. ఈ నేపథ్యంలో ఆమె దుబాయ్‌లో శుక్రవారం (అక్టోబర్ 11) ఆస్ట్రేలియాతో జరిగే కీలక మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక్క రోజు వ్యవధిలో ఆమె వెళ్లి రావడం కష్టం కావున ఆసీస్ తో మ్యాచ్ కు దూరమవ్వడం దాదాపు ఖాయంగా మారింది. 

ఓపెనర్ మునీబా అలీ ఫాతిమా స్థానంలో కెప్టెన్సీ చేపట్టే అవకాశం ఉంది. పాకిస్థాన్ ఇప్పటివరకు రెండు మ్యాచ్ ల్లో ఆడింది. తొలి మ్యాచ్ లో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. ఆ తర్వాత భారత్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయింది. ప్రస్తుతం పాక్ పటిష్టమైన  ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తో తలపడాల్సి ఉంది. సెమీస్ కు వెళ్లాలంటే ఈ రెండు మ్యాచ్ ల్లో భారీగా గెలవడం తప్పనిసరి. ఈ దశలో ఆ జట్టు కెప్టెన్ సేవలు కోల్పోవడంతో ఎదురు దెబ్బ తగలనుంది. 

మహిళల టీ20 ప్రపంచకప్‌ ఆరంభం నుంచి ఫాతిమా సనా పాకిస్థాన్‌ తరఫున అత్యుత్తమంగా రాణించింది. తన కెప్టెన్ తో శ్రీలంకపై మ్యాచ్ గెలిపించింది. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లోనూ 30 పరుగులు చేసి బౌలింగ్ లో రెండు కీలక వికెట్లు పడగొట్టింది. భారత్ తో జరిగిన మ్యాచ్ లోనో జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మలను ఔట్ చేసి భారత్ కు పాక్ గట్టి పోటీ ఇచ్చేలా చేసింది.