Naseem Shah: పాక్ క్రికెట్ బోర్డు కఠిన నిర్ణయం.. రూ. 4.5 కోట్లు నష్టపోనున్న స్టార్ పేసర్

Naseem Shah: పాక్ క్రికెట్ బోర్డు కఠిన నిర్ణయం.. రూ. 4.5 కోట్లు నష్టపోనున్న స్టార్ పేసర్

ఇంగ్లాండ్ వేదికగా జరిగే 'ది హండ్రెడ్ క్రికెట్ లీగ్‌'లో పాల్గొనాలనుకున్న పాకిస్థాన్ పేసర్ నసీమ్ షాకు నిరాశ ఎదురైంది. అతనికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) ఇచ్చేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) నిరాకరించింది. వివిధ ఫ్రాంచైజీ లీగుల్లో ఆడే సమయంలో ఫిట్‌గా ఉంటున్న క్రికెటర్లు.. దేశం తరుపున ఆడే మెగా టోర్నీల సమయానికి గాయపడుతున్నారు. ఇది జట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలోనే వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కింద షాకు ఎన్ఓసీ ఇచ్చేందుకు పీసీబీ నిరాకరించిందని బోర్డు వర్గాలు తెలిపాయి.   

పాక్ తరుపున మూడు ఫార్మాట్లలోనూ నసీమ్ షా కీలక ప్లేయర్. బంతితో ఇరువైపులా స్వింగ్ రాబట్టగల సమర్థుడు. అలాంటి ఈ పేసర్ గతేడాది కాలంగా ఫిట్‌నెస్ సవాళ్లను ఎదుర్కొంటున్నాడు. ఈ పాక్ పేసర్ అక్టోబర్ 2023లో తన భుజం గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దాంతో, గతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్ 2023 నుండి తప్పుకున్నాడు. ఇది జట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. పాకిస్తాన్ గ్రూప్ దశలోనే పతనమైంది. 

ALSO READ | క్యాన్సర్‌తో పోరాడుతున్న మాజీ క్రికెటర్.. బీసీసీఐ కోటి రూపాయల ఆర్థిక సాయం

అనంతరం నాలుగు నెలల విశ్రాంతి తరువాత జట్టులోకి ఎంట్రీఇచ్చిన షా.. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్ 2024లో ఆశించిన మేర  రాణించలేకపోయాడు. దాంతో, అతనికి ఎన్ఓసీ ఇవ్వకూడదని పీసీబీ నిర్ణయించింది. రాబోయే రెండు నెలల్లో పాకిస్థాన్ కీలకమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ క్రమంలోనే అతన్ని ఫ్రెష్ గా ఉంచాలని పీసీబీ భావిస్తోంది.

రూ. 4.5 కోట్లు నష్టం

ది హండ్రెడ్‌ లీగ్‌లో పాల్గొనేందుకు షా.. బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ తో £125,000(పాకిస్థాన్ కరెన్సీలో దాదాపు రూ. 4.5 కోట్లు) ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పుడు ఎన్ఓసీ రాకపోవడంతో ఆ రూ. 4.5 కోట్లు నష్టపోనున్నాడు. అతని బాటలో మరికొందరు ఉన్నట్లు సమాచారం. కెనడాలో జరిగే గ్లోబల్ టీ20 లీగ్‌లో ఆడేందుకు ఎన్ఓసీ కోసం దరఖాస్తు చేసుకున్న షాహీన్ షా అఫ్రిది, మహమ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్‌లకు పీసీబీ షాకివ్వనున్నట్లు తెలుస్తోంది.