
29 ఏళ్ళ తర్వాత పాకిస్థాన్ లో ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో ఒక ఐసీసీ టోర్నీ నిర్వహించడంతో ఆ దేశంలో క్రికెట్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సైతం గ్రాండ్ గా టోర్నీ నిర్వహించే ప్రయాత్నాలు చేసి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ కట్ చేస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆ దేశ క్రికెట్ బోర్డుకు భారీగా ఆర్ధిక నష్టం జరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిధ్యమిచ్చినదుకు గాను ఏకంగా రూ.739 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. బోర్డు తన పెట్టుబడిపై 85% పైగా నష్టాన్ని చవిచూసిందని రిపోర్ట్స్ చెబుతున్నాయి.
రావల్పిండి, లాహోర్, కరాచీలలోని స్టేడియంలను అప్‌గ్రేడ్ చేయడానికి పాక్ క్రికెట్ బోర్డు 500 కోట్లకు పైగా ఖర్చు పెట్టింది. ఇది అసలు బడ్జెట్ కంటే 50% ఎక్కువ. అదనంగా ఈవెంట్ సన్నాహాల కోసం బోర్డుకు మరో 400 కోట్లు ఖర్చు అయినట్టు సమాచారం. హోస్టింగ్ రుసుము, టిక్కెట్ల అమ్మకాలు, స్పాన్సర్‌షిప్‌ల పాక్ బోర్డుకు కేవలం $6 మిలియన్లు మాత్రమే వచ్చాయి. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు దాదాపు రూ. 869 కోట్లు ఖర్చు చేస్తే వారికి రూ. 52 కోట్లు మాత్రమే వచ్చాయట. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు 85% నష్టాలు తప్పలేదు.
ALSO READ : NZ vs PAK: ఒకే ఓవర్లో నాలుగు సిక్సర్లు.. అఫ్రిదికి చుక్కలు చూపించిన కివీస్ ఓపెనర్
మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్సీలోని పాకిస్థాన్ జట్టు తమ సొంతగడ్డపై ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడడం విశేషం. టోర్నీ ప్రారంభ మ్యాచ్ లో లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఆడింది. బంగ్లాదేశ్ పై ఆడాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. భారత్ పై దుబాయ్ వేదికగా మ్యాచ్ జరిగింది. పాకిస్తాన్‌లో జరిగిన మిగిలిన ఎనిమిది మ్యాచ్‌లలో రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఇదిలా ఉంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ జట్టు విజయం లేకుండానే ముగించింది. భారత్, న్యూజిలాండ్ లపై మ్యాచ్ ఓడిపోగా.. బంగ్లాదేశ్ జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా జరగలేదు.