- టీజీ పీసీబీ సమీక్షా సమావేశంలో అధికారులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: పరిశ్రమలు దుర్వాసనను నియంత్రించడంలో రూల్స్పాటించాలని, అతిక్రమిస్తే చర్యలు తప్పవని పీసీబీ హెచ్చరించింది. ఫార్మా స్యూటికల్, కెమికల్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు చెందిన సుమారు 200 మందితో మంగళవారం సనత్ నగర్ లోని పీసీబీ ఆడిటోరియంలో అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఇండస్ట్రీలు దుర్వాసనను వెదజల్లకుండా పరిశ్రమల సంఘం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసుకుని మూడు షిఫ్టులు పెట్రోలింగ్ నిర్వహించాలని చెప్పారు. పీసీబీ ఆఫీసర్లు తనిఖీలు నిర్వహిస్తారన్నారు. ఎక్విప్మెంట్వినియోగం పక్కాగా ఉండాలని, కాలుష్యాన్ని నియంత్రించే స్క్రబ్బర్‌లను వాడాలన్నారు. కామన్ ఎఫ్లూయెంట్స్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు వ్యర్థ జలాలను పంపని, వ్యర్థ జలాలను అక్రమంగా విడుదల చేస్తున్న పరిశ్రమలను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు.
రూల్స్బ్రేక్ చేస్తే క్లోజింగ్ వారంట్ జారీ చేస్తామన్నారు. కాగా, ప్రజావాణి పోర్టల్ ద్వారా టీజీపీసీబీకి అనేక ఫిర్యాదులు వచ్చాయని, రీజినల్ఆఫీసుల్లో కూడా కంప్లయింట్స్తీసుకున్నామని టీజీపీసీబీ మెంబర్ సెక్రెటరీ రవి చెప్పారు.