
- జిల్లాలో కొన్ని మిల్లులు, క్రషర్, గ్రానైట్ కంపెనీల ఇష్టారాజ్యం
- కెమికల్స్, డస్ట్, ఇతర వ్యర్థాలన్నీ ఓపెన్ ప్లేసుల్లోనే డంప్
- కనీస నిబంధనలు పాటించని కంపెనీలు
- పొల్యూషన్ పెరుగుతున్నా పట్టించుకోని పీసీబీ ఆఫీసర్లు
హనుమకొండ, వెలుగు: జిల్లాలో కాలుష్య కారక కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. గ్రానైట్కట్టింగ్, పాలిషింగ్ ఇండస్ట్రీలు, స్టోన్ క్రషర్లు, పారా బాయిల్డ్ రైస్‌మిల్లులు, వివిధ రకాల కంపెనీలు పీసీబీ రూల్స్ ను తుంగలో తొక్కి నడుస్తున్నాయి. వాటిలోంచి వచ్చే కెమికల్స్, డస్ట్, వ్యర్థాల నిర్వహణకు సదుపాయాలు లేక పరిసరాలు కలుషితం అవుతున్నాయి. గ్రౌండ్వాటర్తోపాటు వాతావరణ కాలుష్య పెరిగి, ప్రజలు, పశుపక్ష్యాదులకు సమస్యలు తలెత్తుతున్నాయి. జిల్లాలోని ఇండస్ట్రీల్లో తరచూ తనిఖీలు చేపట్టి, కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(పీసీబీ) ఆఫీసర్లు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తుండగా, కొందరు అధికారులు కాసులకు కక్కుర్తి పడి లైట్తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గ్రానైట్ వ్యర్థాలతో సమస్యలు..
వరంగల్ నగరానికి సమీపంలోని ఎల్కతుర్తి, రాంపూర్ ఇండస్ట్రియల్ ఏరియాల్లో దాదాపు 60 వరకు గ్రానైట్‌క్వారీలు, స్టోన్కట్టింగ్, పాలిషింగ్ ఇండస్ట్రీలున్నాయి. అందులో ఏ ఒక్కటి కూడా పీసీబీ రూల్స్సక్రమంగా పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ ఇండస్ట్రీలు చాలావరకు స్టోన్కట్టింగ్, పాలిషింగ్ వ్యర్థాలను ఓపెన్ప్లేసుల్లోనే డంప్ చేస్తున్నాయి. పాలిషింగ్కోసం ఎపోక్సిరైసిన్, ఇతర కెమికల్స్ వాడుతుండగా, వాటిని కూడా ఇష్టారీతిన బయటకు వదులుతున్నారు.
దీంతో గ్రౌండ్ వాటర్‌తో పాటు పరిసరాలు కలుషితమవుతున్నాయి. ఫలితంగా ఆ చుట్టుపక్కల పంటలు సరిగా పండక రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జిల్లాలోని ఐనవోలు, హసన్ పర్తి, ధర్మసాగర్, వేలేరు, ఎల్కతుర్తి, శాయంపేట, పరకాల, ఆత్మకూరు తదితర మండలాల్లోని స్టోన్ క్రషర్లు ఇష్టారీతిన పేలుళ్లకు పాల్పడుతున్నాయి. ఆఫీసర్లు ఇంతవరకు తనిఖీలు చేపట్టిన దాఖలాలు లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రైస్మిల్స్వ్యర్థాలూ బయటికే..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బాయిల్డ్, రా రైస్ మిల్స్సుమారు 255 వరకు ఉండగా, వాటిలో చాలావరకు నిబంధనలు పాటించడం లేదు. పీసీబీ రూల్స్ ప్రకారం మిల్లుల్లోని వడ్ల పొట్టు(ఊక) గాలిలో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పారాబాయిల్డ్ మిల్లుల్లో వినియోగించిన నీటిని తప్పనిసరిగా ఎస్టీపీలతో శుద్ధి చేసిన తర్వాతే మొక్కల రక్షణకు వినియోగించడమో, లేదా బయటకు వదలడమో చేయాలి. కానీ ఎక్కడా అలాంటి చర్యలే ఉండటం లేదు. ఇలా రూల్స్ పాటించని మిల్స్‌లో తనిఖీలు చేపట్టి కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన పీసీబీ ఆఫీసర్లు అటువైపు తొంగికూడ చూడకపోవడం గమనార్హం. ఎవరైనా కంప్లైంట్చేస్తే నామమాత్రంగా తనిఖీలు చేపట్టడం, ఆ తర్వాత లైట్ తీసుకోవడం షరా మామూలేననే వాదనలు వినిపిస్తున్నాయి.
ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం..
జిల్లాలో ఇండస్ట్రీలు పీసీబీ రూల్స్ బ్రేక్ చేస్తున్న విషయం ఇంతవరకు మా దృష్టికి రాలేదు. గ్రానైట్కంపెనీలు, బాయిల్డ్ రైస్ మిల్స్ గురించి ఇప్పటివరకైతే ఫిర్యాదు అందలేదు. ప్రగతి సింగారం డాంబర్ ప్లాంట్అనుమతుల గురించి ఎంక్వైరీ చేయిస్తాం. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అనుమతులు లేని, రూల్స్బ్రేక్ చేసిన ఇండస్ట్రీలపై తగిన యాక్షన్ తీసుకుంటాం.
ఆర్.సునీత, ఈఈ, పీసీబీ