భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టు అంచనాలకు తగ్గటుగా రాణించలేదు. ఇప్పటివరకూ ఆడిన 6 మ్యాచ్‌ల్లో రెండింట మాత్రమే విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇంకా ఆ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడాల్సివుండగా, అన్నింటా విజయం సాధించినా సెమీస్ చేరేది అనుమానమే. ఓవైపు ఈ ఓటమి బాధలో ఉన్న ఆ జట్టు అభిమానులకు మరో పిడుగులాంటి వార్త ఇది. పాక్ వరల్డ్ కప్ జట్టుపై అవినీతి ఆరోపణలు గప్పుమంటున్నాయి.
మెగా టోర్నీలో పాక్ ఓటములకు బాధ్యత వహిస్తూ చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ సోమవారం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇది తెలియగానే ప్రపంచమంతా చీఫ్ సెలెక్టర్‌గా ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ అతడు తప్పుకున్నారు అని అనుకున్నారు. కానీ వాస్తవం అది కాదట. పాక్ వరల్డ్ కప్ జట్టు ఎంపికలో ఇంజమామ్ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతోనే తన పదవికి రాజీనామా చేశాడట. ఈ విషయంపై పాక్ మీడియాలో విచ్చలవిడిగా కథనాలు వస్తున్నాయి.
ఏంటి వివాదం..?
పాకిస్తాన్‌కు చెందిన యజో ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్లేయర్ ఏజెన్సీలో ఇంజమామ్‌కు వాటా ఉన్నట్లు సమాచారం. ఈ కంపెనీతో ప్రస్తుత పాక్ వరల్డ్ జట్టులోని బాబర్ ఆజమ్, షహీన్ షా అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్‌లతో పాటు మరికొందరి ఆటగాళ్లకు సంబంధాలు ఉన్నాయట. దీంతో ఇంజమామ్ తనకు అనుకూలంగా ఉండే ఆటగాళ్లనే వరల్డ్ కప్‌కు ఎంపిక చేశారనేది అతనిపై వస్తున్న ఆరోపణలు. ఈ విషయంపై మీడియాలో కథనాలు రావడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అప్రమత్తమైంది. నిజానిజాలు తేల్చేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ విచారణలో ఇంజమామ్‌పై వచ్చిన ఆరోపణలు వాస్తవమని తేలితే అతనిపై తీవ్ర చర్యలుంటాయని పీసీబీ అధికారులు మీడియాకు తెలిపారు.
అవన్నీ అవాస్తవం: ఇంజమామ్
ఈ ఆరోపణలను ఇంజమామ్ ఖండించాడు. తనకు ప్లేయర్ ఏజెంట్ కంపెనీలతో ఎలాంటి సంబంధం లేదని, వాస్తవాలు తెలుసుకోకుండా తనపై ఆరోపణలు చేయడం తగదని ఇంజమామ్ తన రాజీనామ లేఖలో వెల్లడించాడు. చివరకు ఈ విషయం ఆటగాళ్ల మెడకు చుట్టుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు.