2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఎక్కడ జరగబోతుందనే ప్రశ్న గత కొంత కాలం నుంచి చర్చనీయాంశంగా మారింది. షెడ్యూల్ ప్రకారం ఈ మెగా టోర్నీ పాకిస్థాన్ లోనే జరగాల్సి ఉండగా.. దుబాయ్ లో నిర్వహిస్తారని కొన్ని నివేదికలు తెలిపాయి. అయితే ఈ విషయంపై పాక్ క్రికెట్ బోర్డు తాజాగా స్పష్టతను ఇచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ పాక్ లోనే జరుగుతుందని స్పష్టం చేసింది.
దుబాయ్ లో నిన్న (డిసెంబర్ 15) ఐసీసీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మధ్య మీటింగ్ జరిగింది. ఇందులో భాగంగా ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్య ఒప్పందంపై పాకిస్థాన్, ఐసీసీ మధ్య సంతకాలు జరిగాయి. దీనికి సంబంధించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం దుబాయ్‌లోని ఐసీసీ ప్రధాన కార్యాలయంలో బోర్డు ఛైర్మన్ జకా అష్రఫ్, ఐసీసీ జనరల్ కౌన్సెల్ జోనాథన్ హాల్ మధ్య ‘హోస్టింగ్ హక్కుల ఒప్పందం’పై సంతకం చేసినట్లు పీసీబీ తెలిపింది.
ఛాంపియన్స్ ట్రోఫి 2025 ఆతిధ్యం పాకిస్థాన్ దే అని.. టోర్నీకి వచ్చే విదేశీ జట్లకు భద్రత కల్పించాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని బోర్డు కోరినట్లు పీసీబీ తెలిపింది. ఇక పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాని అన్వర్-ఉల్-హక్ బోర్డుకు హామీ ఇచ్చారని కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో భారత్ ఈ మెగా టోర్నీ కోసం పాక్ గడ్డపై అడుగుగుపెడుతుందా అనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
ఆసియా కప్ 2023 నిర్వహణలోనూ ఇదే విషయంపై చర్చ నడిచింది. పాక్ లో పర్యటించేది లేదని భారత్ ఖరాఖండీగా చెప్పడంతో చివరకు హైబ్రిడ్ మోడల్ లో ఈ టోర్నీని నిర్వహించారు. మరి ఈ సారి భారత్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. చివరిసారి 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించగా టీమిండియాను ఓడించి పాక్ ట్రోఫీ గెలిచింది.
PCB signs Champions Trophy hosting rights agreement with ICC
— PCB Media (@TheRealPCBMedia) December 15, 2023
Details here⤵️https://t.co/s94ACBDzYd