చెన్నైలో అఫ్గానిస్తాన్‌తో, బెంగళూరులో ఆస్ట్రేలియాతో ఆడేందుకు భయపడుతున్న దాయాది జట్టు
న్యూఢిల్లీ: ఆసియా కప్‌పై అనిశ్చితి తొలిగినా.. ఇండియా ఆతిథ్యం ఇవ్వనున్న వన్డే వరల్డ్ కప్ అధికారిక షెడ్యూల్‌పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. పాకిస్తాన్ కోరుకున్నట్టే ఆసియా కప్‌ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేందుకు ఒప్పుకున్నా.. వరల్డ్ కప్ విషయంలో పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కొర్రీలు పెడుతోంది. మెగా టోర్నీ కోసం ఆతిథ్య బీసీసీఐ, ఐసీసీ రూపొందించిన ప్రతిపాదిత షెడ్యూల్‌లో మార్పులు కోరుతోంది. కొన్ని వేదికల్లో ఆడేందుకు ఆ జట్టు ఒప్పుకోవడం లేదు. అఫ్గానిస్తాన్ జట్టుతో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆడేందుకు ఇష్టపడటం లేదు. చెపాక్ స్టేడియం పిచ్ స్పిన్నర్లకు అనుకూలించడమే ఇందుకు కారణం. ఇదొక్కటే కాదు ఆస్ట్రేలియాతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆడేందుకు ససేమిరా అంటోంది. దాంతో, వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకటన మరింత ఆలస్యం అయ్యేలా ఉంది.
అఫ్గాన్ స్పిన్నర్ల భయంతో..
అక్టోబర్–నవంబర్‌లో ఇండియా వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం ప్రతిపాదిన షెడ్యూల్‌ను ఖరారు చేసే ముందు సలహాలు, సూచనల కోసం పీసీబీ సహా అన్ని దేశాల బోర్డులకు ఐసీసీ దాన్ని పంపించింది. ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం పాక్‌కు హైదరాబాద్ సహా ఐదు వేదికలు కేటాయించారు. ఈ షెడ్యూల్‌ను పీసీబీ తమ జట్టుతో పాటు సెలక్టర్లు, టీమ్ స్ట్రాటజీ ఎక్స్‌పర్ట్స్‌కు పంపించింది. దాన్ని ఆమోదించే పనిని వారికే అప్పగించింది. వాళ్లు చెన్నైలో అఫ్గాన్‌తో, బెంగళూరులో ఆస్ట్రేలియాతో ఆడేందుకు జట్టు సౌకర్యవంతంగా లేదని చెప్పినట్టు తెలుస్తోంది. స్పిన్‌కు అనుకూలమైన చెన్నైలో అఫ్గాన్‌తో మ్యాచ్ అంటే ఐపీఎల్16లో గుజరాత్ టైటాన్స్ తరఫున అదరగొట్టిన స్పిన్నర్లు రషీద్ ఖాన్, నూర్ అహ్మద్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీని వల్ల జట్టుకు నష్టం జరిగే అవకాశం ఉందని పాక్ భావిస్తోంది. గత చరిత్ర, గణాంకాల పరంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే వేదిక కాబట్టి అఫాన్‌తో జరిగే మ్యాచ్‌కు చెన్నై వేదికగా ఒప్పుకోవద్దని సెలక్టర్లు బోర్డుకు సూచించినట్లు పీబీసీ వర్గాలు తెలిపాయి. అయితే, చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో ఆడేందుకు పాక్ ఎందుకు ఇష్టపడడం లేదో అర్థం కావడం లేదు. బెంగళూరులో పరిస్థితులు బ్యాటింగ్ అనుకూలంగా ఉంటాయి. బహుశా ఆసీస్ టీమ్‌లోని హార్డ్ హిట్టర్లను అడ్డుకోవడం కష్టమనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.ఈ మ్యాచ్‌లను రీషెడ్యూల్ చేయమని ఐసీసీ, బీసీసీఐని కోరే చాన్సుంది. అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్ బెంగళూరులో, ఆస్ట్రేలియాతో మ్యాచ్ చెన్నైలో ఆడించాలని రిక్వెస్ట్ చేస్తామని పీసీబీ వర్గాలు చెబుతున్నాయి.
బలమైన కారణం ఉంటేనే మార్పులు..
టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌పై సభ్య దేశాల నుంచి ఐసీసీ సూచనలు అడగడం ప్రోటోకాల్‌లో భాగం. అయితే, వేదికలను మార్చాలనడానికి బలమైన కారణం ఉండాలి. ‘ఇదే పాకిస్తాన్ జట్టు 2016లో టీ20 వరల్డ్ కప్ కోసం మన దేశం వచ్చినప్పుడు.. భద్రత దృష్ట్యాఇండో–-పాక్ మ్యాచ్‌ని ధర్మశాల నుంచి కోల్‌కతాకు మార్చాలని కోరింది. దీనికి బీసీసీఐ, ఐసీసీ అంగీకరించాయి. అయితే, గ్రౌండ్‌లో జట్టు బలాలు, బలహీనతల ప్రకారం వేదికపై అభ్యంతరాలను వ్యక్తం చేయడం ప్రారంభిస్తే మాత్రం షెడ్యూల్ ను ఖరారు చేయడం చాలా కష్టంగా మారుతుంది. కాబట్టి బలమైన కారణం ఉంటే తప్ప వేదికలకు సంబంధించినంత వరకు ఎటువంటి మార్పులు చేయలేరు’ అని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
అహ్మదాబాద్‌కు ఓకే!
గత నెలలోనే పీసీబీకి కొత్త నేషనల్ సెలక్షన్ కమిటీ వచ్చింది. తొలిసారిగా నేషనల్ మెన్స్ టీమ్‌కు డైరెక్టర్ గా మిక్కీ అర్థర్, అనలిటిక్స్, టీమ్ స్ట్రాటజీ మేనేజర్‌గా హసన్ చీమాను నియమించారు. హెడ్ కోచ్‌గా గ్రాండ్ బ్రాడ్‌బర్న్ ఉన్నాడు. ఆధునిక క్రికెట్ అవసరాల్లో భాగంగా మ్యాచ్‌కు ముందు టీమ్ స్ట్రాటజీ రూపొందించేందుకు వీళ్లు డేటా విశ్లేషణలపై ఎక్కువగా ఆధారపడతారని చీఫ్ సెలెక్టర్ హరూన్ రషీద్ అన్నారు. ఈ నేపథ్యంలో చెన్నై, బెంగళూరు వేదికలపై పాక్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఇక, అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో ఇండియాతో మ్యాచ్‌కు పీసీబీ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. కానీ, తమ ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తోంది.