బీసీల్లో రాజకీయ చైతన్యం రావాలి : మధుయాష్కి గౌడ్

  •     పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ 

సూర్యాపేట , వెలుగు : బీసీల్లో రాజకీయ చైతన్యం రావాలని  పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ అన్నారు. సోమవారం సూర్యాపేటలోని జే ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బీసీల ఐక్యవేదిక సమావేశానికి మాజీ రాజ్యసభ మాజీ సభ్యుడు  వి.హనుమంతరావుతో కలిసి చీఫ్‌ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 54 శాతం ఉన్న బీసీలను కేవలం  సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, ఎంపీటీసీ స్థానాలకే పరిమితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్ ఇస్తే గెలిచి చూపిస్తారన్నారు. ప్రజల ఆలోచనలో మార్పు వచ్చిందని ఏ పార్టీ అయినా బీసీ ఓట్లు ఉంటేనే గెలుస్తుందని స్పష్టం చేశారు.  

టీఆర్ఎస్, బీఆర్ఎస్‌గా మారినప్పుడే కేసీఆర్ పని అయిపోయిందని విమర్శించారు.  అధికార పార్టీ నేతలకు రూ. 2 లక్షలు ఇస్తే తప్ప  డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వడం లేదని ఆరోపించారు.  గతంలో ఇందిరమ్మ ఇల్లు, పింఛన్లు, పేదలకు భూములు ఇచ్చిన కాంగ్రెస్‌ను ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని, బీసీలంతా మద్దతుగా ఉండాలని కోరారు.  పీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, నేతలు లక్ష్మణ్ యాదవ్, బీర్ల ఐలయ్య, పున్న కైలాష్ నేత, రాపోలు జయప్రకాశ్, కృష్ణయ్య, అనురాధ కిషన్ రావు, సిరాజ్ ఖాన్, తండు సైదులు గౌడ్, తంగేళ్లపల్లి రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.