మునుగోడు, వెలుగు: పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో గొడవలు సృష్టించినట్లే.. ఇక్కడ మునుగోడు ఉప ఎన్నికలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర పన్నాయని పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో చీకట్లో ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉపదేశం తీసుకుని మునుగోడుకు భారీ కాన్వాయ్‌తో రాబోతున్నారని చెప్పారు. ఆయన వచ్చీరావడంతోనే ఏదో ఒక అలజడి సృష్టించే ప్రయత్నం జరగబోతోందని, ఎన్నికల సంఘం కార్యాలయం ముందు బైఠాయించి, స్థానిక సెంటిమెంట్‌ను రాజేయడం ద్వారా కుట్రకు ఆజ్యం పోయబోతున్నారని ఆరోపించారు. మునుగోడు మండలం కొంపల్లిలో రేవంత్ బుధవారం మీడియాతో మాట్లాడారు. త్వరలో అమిత్ షా ఆదేశంతో మునుగోడుకు సీఆర్పీఎఫ్ బలగాలు వచ్చి టీఆర్ఎస్ నాయకులపై.. రాష్ట్ర పోలీసులు బీజేపీ నాయకులపై దాడులు చేస్తారన్నారు. ఉద్రిక్తతలు సృష్టించి ఆ పార్టీల మధ్యనే ఓట్లు పోలరైజ్ చేయడమే దీని ఉద్దేశమన్నారు. ‘‘ప్రశాంత్ కిషోర్ సూచనలతో బెంగాల్లో తృణమూల్, బీజేపీ మధ్య ఇదే కుట్ర చేశారు. మమత అధికారంలో కొనసాగేలా, బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇదే కుట్రను ఇప్పుడు మునుగోడులో బీజేపీ, టీఆర్ఎస్ రక్తికట్టించబోతున్నాయి” అని వివరించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు అప్రమత్తంగా ఉండి, కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
టీఆర్ఎస్కు రెండో స్థానం ఎట్లిస్తరు?
మునుగోడులో బ్యాలెట్ పేపర్ రూపొందించడంలో రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘం విఫలమైందని రేవంత్ అన్నారు. బ్యాలెట్ పేపర్లో నాలుగో స్థానంలో ఉండాల్సిన టీఆర్ఎస్ను రెండో స్థానంలోకి ఎలా తెస్తారని ప్రశ్నించారు. జాతీయ పార్టీ అభ్యర్థులను ముందు ఉంచి, ఆ తర్వాతే ప్రాంతీయ పార్టీ అభ్యర్థులను ఉంచాలని, టీఆర్ఎస్ ఇంకా జాతీయ పార్టీ కాలేదన్నారు. బ్యాలెట్ పేపర్ మార్చాలని డిమాండ్ చేశారు.
ఈటల, రఘునందన్‌పై కేసులు ఏమైనయ్?
దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల సందర్భంలో కేసులు, భూ కబ్జాలు అంటూ ప్రభుత్వం హడావుడి చేసిందని.. రఘునందన్, ఈటల రాజేందర్ గెలిచిన తర్వాత వాళ్లపై కేసులు కాకులెత్తుకెళ్లాయా? అని రేవంత్ ప్రశ్నించారు. దుబ్బాక ఎన్నికల సమయంలో రఘునందన్ బావమరిది దగ్గర కోటి రూపాయలు పట్టుకున్నారని, అప్పుడు కావాలనే హడావుడి సృష్టించారన్నారు. హుజూరాబాద్‌లోనూ ఈటలపై భూకబ్జా కేసు పెట్టి, అరెస్టే తరువాయి అన్నట్టు హడావుడి చేసి మరిచిపోయారన్నారు. రెండు చోట్లా బీజేపీ గెలుపునకు కేసీఆర్ పరోక్షంగా సహకరించారని ఆరోపించారు.
కేసులు పెడ్తలె.. పైసలెవరివో చెప్తలె
‘‘రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తల అంతు చూస్తానంటూ బెదిరిస్తున్నారు. మా కార్యకర్తలపై, మా వెహికల్స్‌పై బీజేపీ వాళ్లు దాడులు చేస్తున్నారు. కేసులు పెడుతున్నారు. కానీ, మా వాళ్లపై దాడులు చేస్తున్నా, చంపేస్తామని బెదిరిస్తున్నా రాజగోపాల్ రెడ్డిపై కేసులు ఎందుకు నమోదు చేయడం లేదు?” అని రేవంత్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై లేదా? అని అడిగారు. ఇటీవల పోలీసుల తనిఖీల్లో కోట్ల రూపాయలు డబ్బులు దొరుకుతున్నాయన్నారు. గతంలో ఇలా డబ్బులు దొరికితే అవి ఎవరి వద్ద దొరికాయో పోలీసులు మీడియాతో చెప్పేవారని, ఇప్పుడు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు.