- సమన్వయంతో ముందుకెళ్లాలి
- స్థానిక ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యత మీదే
- అవినీతికి పాల్పడితే సహించేది లేదని వార్నింగ్
- అందరూ కష్టపడి పని చేయాలి: దీపాదాస్ మున్షి
- మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల నేతలతో రివ్యూ
హైదరాబాద్, వెలుగు: ఎంత సీనియర్ లీడర్ అయినా... పార్టీ లైన్ దాటితే ఉపేక్షించేది లేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ హైకమాండే సుప్రీం అని తేల్చి చెప్పారు. నేతల మధ్య సమన్వయ లోపం ఉంటే సహించేది లేదని, ఏ స్థాయి లీడర్ అయినా.. కార్యకర్తలందరినీ కలుపుకుని వెళ్లాల్సిందే అని అన్నారు. గాంధీభవన్‌లో మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల నేతలతో మంగళవారం ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించే బాధ్యత పార్టీ నేతలదే.
ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు పార్టీ కార్యకర్తలతో సమన్వయం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ పాటించాల్సిందే. ఇందులో ఎవరికీ.. ఎలాంటి మినహాయింపులుండవు. కష్టపడి పని చేసేవారికే మంచి భవిష్యత్తు ఉంటది. పథకాలు అమలు చేయడంలో ప్రజలకు అండగా ఉండాలి. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చూడాలి. ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడొద్దు. ఎవరి దగ్గరి నుంచైనా ఒక్క పైసా తీసుకున్నట్లు తెలిసినా.. కఠిన చర్యలు తీస్కుంటం’’అని మహేశ్ కుమార్ గౌడ్ హెచ్చరించారు.
ప్రజల మధ్యే ఉండాలి
ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తున్నదని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ‘‘ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముందున్నం. సీఎం రేవంత్, మంత్రులు అద్భుతమైన పాలన అందిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యోగాలు ఇస్తున్నం. మహిళలకు ఫ్రీ బస్ సౌక్యం, రూ.2లక్షల రుణమాఫీ, రూ.500కే గ్యాస్, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అందిస్తున్నం. నేతలంతా ప్రజల మధ్యే ఉండాలి’’అని మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశించారు.
పక్కా వ్యూహంతో ముందుకెళ్లాలి: దీపాదాస్ మున్షి
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పక్కా వ్యూహంతో ముందుకెళ్లాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి అన్నారు. ‘‘లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి వెళ్లాయి. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పని చేస్తున్నాయి. రాబోయే స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి మంచి ఫలితాలు తీసుకొచ్చేందుకు అందరూ కష్టపడి పని చేయాలి.
గతంలో ఇందిరా గాంధీ మెదక్ నుంచి ఎంపీగా గెలిచారు. అక్కడి నేతలు, కార్యకర్తలంటే హైకమాండ్‌కు ఎంతో ప్రేమ, అభిమానం. కేసీఆర్, హరీశ్‌కు గట్టి పోటీ ఇవ్వాలి’’అని దీపాదాస్ మున్షి కోరారు. సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, మంత్రులు దామోదర రాజనర్సింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు.
నేడు హైదరాబాద్ జిల్లాపై రివ్యూ
హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలతో బుధవారం ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సమావేశం కానున్నారు. తర్వాత గ్రేటర్ హైదరాబాద్‌లోని కార్పొరేటర్లతోనూ భేటీ అవుతారు. హైడ్రా అమలు, మూసీ ప్రక్షాళన, ప్రజల్లో సానుకూలత ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాగా, పీసీసీ అనుబంధ సంఘాల చైర్మన్లతో సమావేశాన్ని పీసీసీ చీఫ్ రద్దు చేసుకున్నారు.