మూసీ ప్రక్షాళనకు ఖర్చు చేసేది 1,500 కోట్లే: పీసీసీ చీఫ్ మహేశ్

మూసీ ప్రక్షాళనకు ఖర్చు చేసేది 1,500 కోట్లే: పీసీసీ చీఫ్ మహేశ్
  • మూసీ నిర్వాసితులకు అన్యాయం చేయం
  • హైడ్రాతో హైదరాబాద్​లో రియల్ ఎస్టేట్ పడిపోలే
  • ఇంకొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్​లో ఉన్నారని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: మూసీ ప్రక్షాళనకు రూ.వెయ్యి కోట్ల నుంచి రూ.1,500 కోట్లు మాత్రమే ఖర్చవుతాయని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. మూసీ ప్రక్షాళన కోసం ఇంకా డీపీఆర్ సిద్ధం కాలేదని, అలాంటప్పుడు లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ ఎలా ప్రచారం చేస్తారని మండిపడ్డారు. గాంధీభవన్​లో ఆయన మీడియాతో శుక్రవారం చిట్​చాట్ చేశారు.

మూసీ ప్రక్షాళన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు కాకపోయినా.. రానున్న రోజుల్లో అయినా మూసీ ప్రక్షాళన చేయాల్సిందే అన్నారు. ఏ ఒక్క పేద కుటుంబానికి అన్యాయం జరగనివ్వమని, వారి కోసం 18వేల డబుల్ బెడ్​రూం ఇండ్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

మూసీ ప్రక్షాళన.. సుందరీకరణ వేర్వేరు

మూసీ వెంట ఉన్న పేదల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని మహేశ్ కుమార్​గౌడ్ అన్నారు. ‘‘దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెట్టే పార్టీ బీజేపీ. హైదరాబాద్ డెవలప్ కావాలనుకుంటే బీజేపీ, బీఆర్ఎస్ నేతలు మూసీ ప్రక్షాళనకు సహకరించాలి. హైడ్రాతో హైదరాబాద్​లో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందంటూ ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయి.

మూసీ ప్రక్షాళన తర్వాత రియల్ ఎస్టేట్ మరింత పుంజుకుంటది. మూసీ ప్రక్షాళన వేరు.. సుందరీకరణ వేరు. మేము చేసేది ప్రక్షాళన మాత్రమే’’అని మహేశ్ కుమార్ తెలిపారు.

త్వరలో మంత్రివర్గ విస్తరణ

త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికల్లో హైకమాండ్ బిజీగా ఉండటం వల్లే విస్తరణ ఆలస్యమైందని తెలిపారు. ‘‘అన్ని జిల్లాల్లో పర్యటించాకే కార్యవర్గం ఏర్పాటు చేస్తా. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్​లో చేరిన్రు. ఇంకొంత మంది మాతో టచ్​లో ఉన్నరు. రూ.2లక్షలపైన బకాయిలు ఉన్న రైతులు అదనపు మొత్తం చెల్లిస్తే.. మిగిలిన రెండు లక్షలు మాఫీ చేస్తాం.

బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగింది. అందుకే కవితకు బెయిల్ వచ్చింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తయ్. కోట్లు ఖర్చు పెడుతూ సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్​పై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేయిస్తున్నది. దుబాయ్ నుంచి ఆపరేట్ చేయిస్తున్నరు’’అని అన్నారు. 

ప్రతి పేద బిడ్డకు నాణ్యమైన విద్యనందిస్తాం

కులగణన విషయంలో రాహుల్ గాంధీ ఆలోచనా విధానమే.. రేవంత్, పీసీసీ విధానమని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ‘‘నాగార్జున కేసు వ్యవహారంలో కొండా సురేఖ గురించి ఇప్పటి దాకా హైకమాండ్ నన్ను వివరణ అడగలేదు. ఆమె విషయంలో పార్టీపరంగా ఎలాంటి చర్యలు ఉండవు. ప్రతి పేద బిడ్డకు నాణ్యమైన విద్యనందించడమే ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ లక్ష్యం. ఫిరోజ్ ఖాన్​పై మజ్లిస్ నేతల దాడి అంశం లా అండ్ ఆర్డర్​కు సంబంధించింది.

చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్​ను కోరినం. రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు’’అని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. కాగా, పీసీసీ చీఫ్​ను ఫిరోజ్ ఖాన్ గాంధీభవన్​లో కలిసి దాడి గురించి కంప్లైంట్ చేశారు. త్వరలో రేవంత్​ను కలుస్తానని ఫిరోజ్ ఖాన్ మీడియాకు తెలిపారు.