- బీసీ సంఘాలను ఆ పార్టీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నరు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- కులగణన సర్వేలో ఎలాంటి తప్పుల్లేవ్
- తప్పు జరిగినట్టు ఒక్క ఆధారమున్నా చర్చకు సిద్ధం
- బీసీల పేరుతో బీఆర్ఎస్ పదేండ్లు పబ్బం గడుపుకున్నదని ఫైర్
- వారి హయాంలో బీసీలకు ఏమీ చేయలేదు: మంత్రి పొన్నం
- దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్
- కులగణనను అడ్డుకుంటే నష్టపోయేది బీసీలమే: మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ట్రాప్లో పడొద్దని బీసీలకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. బీసీ సంఘాలను బీఆర్ఎస్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అబద్ధాలు నమ్మి ప్రతిపక్షాల ఉచ్చులో చిక్కుకోవద్దని బీసీలను కోరారు. బుధవారం గాంధీ భవన్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో కలిసి మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. కులగణన సర్వేను శాస్త్రీయంగా నిర్వహించామని, ఇందులో ఎలాంటి తప్పుల్లేవని ఆయన చెప్పారు.
కులగణన సర్వేలో తప్పులు జరిగినట్టు ప్రతిపక్షాల వద్ద ఏం ఆధారాలు ఉన్నాయి? అలా ఒక్క ఆధారమున్నా చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం” అని బీఆర్ఎస్, బీజేపీకి సవాల్ విసిరారు. కులగణన, ఎస్సీ వర్గీకరణతో బీసీలు, ఎస్సీల దశాబ్దాల కల సాకారమైందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల చొరవతో కులగణన, ఎస్సీ వర్గీకరణకు మోక్షం లభించిందని పేర్కొన్నారు. ‘‘స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కులగణన జరిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ.
బిహార్ లాంటి రాష్ట్రాల్లో కుల గణన చేపట్టినా, ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. కులగణన సర్వేపై విమర్శలకు బదులు ప్రతిపక్షాలు సలహాలు, సూచనలు చేస్తే బాగుంటుంది. రాష్ట్రంలో 56 శాతానికి పైగా బీసీలు ఉన్నారని సర్వేలో తేలింది. కేవలం 3.1 శాతం (దాదాపు 10 లక్షలు) మంది మాత్రమే సర్వేలో పాల్గొనలేదు. అందులోనూ హైదరాబాద్ సిటీ జనం మాత్రమే సర్వేకు దూరంగా ఉన్నారు. మిగతా 96 శాతం సర్వే శాస్త్రీయంగా, పకడ్బందీగా జరిగింది” అని మహేశ్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ పుణ్యమా అని రాష్ట్రంలో బీసీ జనాభా ఎంతుందో లెక్క తేలిందని చెప్పారు.
బీఆర్ఎస్ది కడుపుమంట..
తమ ప్రభుత్వం కులగణన సర్వేను విజయవంతంగా పూర్తి చేయడంతో బీఆర్‌ఎస్ నేతలకు కడుపుమంటగా ఉందని మహేశ్ గౌడ్ విమర్శించారు. ‘‘సర్వేపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. కానీ ఆ పార్టీ పెద్దలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ఇందులో పాల్గొననేలే దు. కవిత ఒక్కరే సర్వేలో పాల్గొన్నారు. తలసాని కూడా ఇందులో పాల్గొన్నారా? లేదా? తెలియదు” అని చెప్పా రు. బీసీల పేరుతో బీఆర్ఎస్ పదేండ్లు పబ్బం గడుపుకున్నదని ఫైర్ అయ్యారు. అడుగడుగునా బీసీలను అణగదొక్కిన పార్టీ బీఆర్ఎస్సే అని మండిపడ్డారు.
పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు..
కాంగ్రెస్ లో చిన్నా, పెద్దా ఎవరైనా సరే.. పార్టీ లైన్ దాటి మాట్లాడితే చర్యలు తప్పవని మహేశ్ గౌడ్ హెచ్చరించారు. పార్టీ లైన్ దాటి మాట్లాడిన వారిపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. సమగ్ర సర్వే వివరాలు ఎందుకు బయటపెట్టలేదు? అని కేసీఆర్ ఇంటి ముందు ధర్నా చేస్తే బాగుంటుందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు సూచించారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని.. పీసీసీ కమిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 నుంచి 60 శాతం పదవులు ఇస్తామని చెప్పారు.
సర్వేలో పాల్గొనని వారికి మాట్లాడే హక్కు ఎక్కడిది?: పొన్నం
కులగణన సర్వేలో పాల్గొనని వారికి, దానిపై విమర్శలు చేసే నైతిక హక్కు ఎక్కడిదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కులగణనను అడ్డుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నించిందని మండిపడ్డారు. ‘‘పదేండ్ల పాలనలో బీసీలకు బీఆర్ఎస్ ఏం చేసింది? దీనిపై చర్చకు సిద్ధమా? అసెంబ్లీకి రమ్మంటారా? చార్మినార్ కు రమ్మంటారా? బల్కంపేట ఎల్లమ్మ గుడి దగ్గరికి రమ్మంటారా? ఎక్కడికి రమ్మంటారో చెప్పండి.. చర్చ చేద్దాం” అని బీఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసిరారు. కులగణనలో ఏం పొరపాట్లు జరిగాయో చెబితే, వాటిని బాధ్యతగా సరిచేస్తామని చెప్పారు. ‘‘బలహీన వర్గాలకు ఒక రోడ్ మ్యాప్ తయారైంది. కుట్రదారుల ట్రాప్ లో బీసీలు పడొద్దు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం అన్ని హామీలు అమలు చేస్తాం” అని తెలిపారు.
కులగణన.. ఒక చరిత్ర: కొండా సురేఖ
కులగణన.. ఒక చరిత్ర అని మంత్రి కొండా సురేఖ అన్నారు. ‘‘సమాజంలో బీసీల సంఖ్య పెరుగుతున్నా, అందుకు అనుగుణంగా వారికి సామాజిక న్యాయం జరగడం లేదు. అందుకే రాహుల్ ఆలోచన మేరకు కులగణన చేశాం. సభలో దీనిపై చర్చకు అనుమతి ఇచ్చాం. కానీ బీఆర్‌ఎస్ నేతలు అసెంబ్లీ సమావేశాల మధ్యలోనే వెళ్లిపోవడంతో బీసీలపై వారికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతున్నది” అని మండిపడ్డారు. కులగణనను అడ్డుకుంటే నష్టపోయేది బీసీలమే అని చెప్పారు. విప్లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య పాల్గొన్నారు.
బీసీలపై ప్రతిపక్షాలది కపట ప్రేమ: శ్రీధర్ బాబు
కులగణనపై ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని ప్రతిపక్షాలను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ‘‘రాజకీయాల కోసం ప్రజల్లో అపోహలు సృష్టించవద్దు. శాస్త్రీయంగా, పారదర్శకంగా నిర్వహించిన ఈ సర్వేపై విమర్శలు చేయడం సరైంది కాదు. సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించినోళ్లు.. దాన్ని అశాస్త్రీయంగా జరపడంతోనే అసెంబ్లీలో పెట్టలేకపోయారు.
అందులో పారదర్శకతకు పాతరేసి, తప్పుల తడకగా రిపోర్టు తయారు చేశారు. అందుకే సభలో దాన్ని పెట్టే సాహసం చేయలేకపోయారు” అని బీఆర్ఎస్ ను ఉద్దేశించి మండిపడ్డారు. బీసీలపై ప్రతిపక్షాలు కపట ప్రేమ చూపిస్తున్నాయని, మొదటి నుంచి బీసీలకు అండగా ఉన్నది కాంగ్రెస్ మాత్రమేనని పేర్కొన్నారు.