ఫిబ్రవరి రెండో వారంలో రాష్ట్రానికి రాహుల్

ఫిబ్రవరి రెండో వారంలో రాష్ట్రానికి రాహుల్
  • సూర్యాపేట జిల్లాలో సభ నిర్వహిస్తం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • వచ్చే నెల 5న కేబినెట్ ముందుకుకుల గణన రిపోర్టు
  • లోకల్​బాడీలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేబినెట్​లో చర్చించి నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: ఫిబ్రవరి రెండో వారంలో సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సభ నిర్వహిస్తామని పీసీసీ చీఫ్​మహేశ్ గౌడ్ పేర్కొన్నారు. “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’’ పేరుతో ఈ సభ జరుగుతుందన్నారు. గురువారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. గ్రేటర్ పై ఫోకస్ పెట్టామని, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ గెలుచుకుంటుందని చెప్పారు. వచ్చే నెల 5న కులగణన రిపోర్టు కేబినెట్ సబ్ కమిటీ.. కేబినెట్ ముందుకు వస్తుందన్నారు.

 రిజర్వేషన్ల పెంపుపై కేబినెట్ లో చర్చించి, లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుపై నిర్ణయం తీసుకుంటారన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే రియల్ ఎస్టేట్ పడిపోయిందని, దానిని తమ ప్రభుత్వం గాడిన పెడుతోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియెట్ కు రావడం లేదనే దానిపై స్పందిస్తూ సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన సీసీసీలో లేదా ఇంట్లో సమీక్షలు చేస్తున్నారని, ఇందులో తప్పేమి ఉందన్నారు. అన్ని సౌకర్యాలు ఉన్న పాత సెక్రటేరియెట్ ను కేసీఆర్ కూల్చాల్చిన అవసరం ఏం మెచ్చిందన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు అధికారిక నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో పెట్టుకోవాలని, పార్టీ నేతలు సోనియా, రాహుల్, ఖర్గే ఫొటోలు పెట్టుకోవాలని అన్నారు. 

కేసీఆర్ ను ఉద్యమకారుడిగా అభిమానించినా, వైఎస్ ఆర్ కే అభిమానులు ఎక్కువని, ఆయనుకున్నంత అభిమానులు ఎవరికి లేరని అన్నారు. ఫామ్​హౌస్ పాలనను కోరుకునేది దొరలు మాత్రమేనని.. కేటీఆర్, హరీశ్, కవిత తమ అస్థిత్వం కోసం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా.. తెలంగాణకు వారు తెచ్చిన ప్రాజెక్టులు, నిధులు ఎన్ని అని ప్రశ్నించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడిన ఉద్దేశం వేరని, అధికారుల వల్ల నిధుల విడుదలలో కొంత జాప్యం జరుగుతోందని అనేది ఆయన ఉద్దేశమన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో కొంత జాప్యం జరగవచ్చు కానీ, ప్రతి హామీ  నెరవేర్చుతామని స్పష్టం చేశారు. పటాన్ చెరు గొడవపై కమిటీ ఇంకా నివేదికను ఇవ్వలేదని, నివేదిక రాగానే చర్యలు ఉంటాయన్నారు.