బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ప్రధానిని ఒప్పించే దమ్ముందా? : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ప్రధానిని ఒప్పించే దమ్ముందా? : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
  • కేంద్ర మంత్రి బండి సంజయ్​కి పీసీసీ చీఫ్​ మహేశ్​ గౌడ్​ సవాల్​
  • ఢిల్లీ పెద్దలకు భయపడే బీసీల ధర్నాకు బీజేపీ నేతలు రాలే 
  • రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి  చెప్పులు మోసిన చరిత్ర సంజయ్​ది
  • నోటికొచ్చింది మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్​

హైదరాబాద్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా, బీసీ బిల్లులకు చట్టబద్ధత కోసం వాటిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్​లో  చేర్చేలా ప్రధాని మోదీని ఒప్పించే దమ్ము బండి సంజయ్​కి ఉన్నదా? అని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.  ఢిల్లీ పెద్దలకు భయపడి బీసీల ధర్నాకు  తెలంగాణ బీజేపీ నేతలు హాజరు కాలేదని ఫైర్ అయ్యారు. బండి సంజయ్ చేసిన కామెంట్స్ కు ఆదివారం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్  ఓ ప్రకటనలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  

‘‘రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి కేంద్ర మంత్రి చెప్పులు మోసిన చరిత్ర నీది. నోటికొచ్చింది మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు” అని హెచ్చరించారు.  కాంగ్రెస్ జాతీయ పార్టీ అని,  అన్నీ సమిష్టి నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల మాదిరిగానే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నదని విమర్శించారు.  ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేకనే బీఆర్ఎస్ తో చీకటి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు.

 బండి సంజయ్ లో రోజురోజుకూ అభద్రతా భావం పెరిగిపోతున్నదని, ఆయన మోదీ, అమిత్ షా అనుమతి లేకుండా కనీసం టిఫిన్ కూడా చేయరని ఎద్దేవా చేశారు. సొంత పార్టీ కార్యకర్తలే  బండి సంజయ్ వైఖరిపై గుర్రుగా ఉన్నారని, అధ్యక్ష పదవి రాదని తెలిసి బండి సంజయ్ ఆగమాగం అయితుండని అన్నారు.  గుర్తింపు కోసమే తాను కేంద్రమంత్రిని అని మర్చిపోయి దిగజారి  మాట్లాడుతుండని, బీజేపీ లో ఉనికి కోసం బండి సంజయ్ ఆరాట పడుతున్నాడని తెలిపారు. 

సన్న బియ్యంతో నిరుపేదలకు అసలైన పండుగ 

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి బండి సంజయ్ కి కనిపించకపోవడం విడ్డూరంగా ఉందని మహేశ్​కుమార్​గౌడ్​ అన్నారు.  సుదీర్ఘ కాలం అయినా  రాష్ట్ర అధ్యక్షుడి నియామకం చేసుకోలేని బీజేపీకి.. కాంగ్రెస్ హైకమాండ్ గురించి మాట్లాడే హక్కే లేదని చెప్పారు.  సీఎం రేవంత్ రెడ్డి పూర్తి పట్టు సాధించారు కాబట్టే బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులకు ఆమోదం లభించిందని, బండి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.

‘‘హెచ్ సీయూ అంశం ఉన్నత న్యాయస్థాన పరిధిలో ఉంది. ప్రభుత్వం కమిటీ వేసింది.  రాజకీయ అవసరాల కోసం బండి సంజయ్ మాట్లాడడం సరికాదు.   సన్న బియ్యం కేంద్రం ఇస్తున్నదని బండి ప్రచారం చేస్తున్నారు. అలా అయితే దేశం మొత్తం ఇవ్వొచ్చు కదా? సన్న బియ్యంతో తెలంగాణలో నిరుపేదలకు అసలైన పండుగను మా  ప్రభుత్వం తీసుకొచ్చింది. దేశ చరిత్రలో నిలిచిపోయే కుల గణన, బీసీ బిల్లు, ఎస్సీ వర్గీకరణ, సన్న బియ్యం పంపిణీ మా హయాంలోనే  జరిగాయి”  అని పేర్కొన్నారు.