
- బీఆర్ఎస్, బీజేపీకి పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సవాల్
హైదరాబాద్, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై, ఒక్క ఏడాది కాంగ్రెస్ పాలనలో వచ్చిన పెట్టుబడులపై చర్చకు సిద్ధమా.. అని బీఆర్‌ఎస్, బీజేపీ నేతలకు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ సవాల్ విసిరారు. శుక్రవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు, తర్వాత చిట్ చాట్ చేశారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.25,750 కోట్లు మాత్రమే వస్తే, కాంగ్రెస్ ఏడాది పాలనలో రూ.1.79 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు.
రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై కూడా బీఆర్ఎస్, బీజేపీలు విమర్శించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఎంవోయూలను లెక్కలతో సహా చూపిస్తం.. మమ్మల్ని విమర్శించే ప్రతిపక్షాలు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరారు. మంచి పనులు చేస్తున్నప్పుడు ప్రశంసించడం కూడా నేర్చుకోవాలని సూచించారు. పెట్టుబడులపై చర్చించేందుకు తాను, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వస్తామని, బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్.. ఎవరు వస్తారో రండి అని సవాల్ విసిరారు.
రాష్ట్రానికి రానున్న ఈ పెట్టుబడులతో 50 నుంచి 75 వేల ఉద్యోగాలు దక్కే అవకాశం ఉందన్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రావడంతో రియల్ ఎస్టేట్ రంగానికి కూడా మంచి బూమ్ రానుందన్నారు. త్వరలోనే అన్ని హంగులతో ఫోర్త్ సిటీ కూడా రాబోతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న ‘ తెలంగాణ రైజింగ్ 2050’ విజన్ రాష్ట్రానికి గేమ్ చేంజర్ గా మారనుందన్నారు. పెట్టుబడులకు తెలంగాణ కేరాఫ్ గా నిలిచిందన్నారు. పెట్టుబడులు రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని దావోస్ వేదికగా మరోసారి రుజువైందన్నారు. దావోస్ లో తెలంగాణ పెవిలియన్ వద్ద ప్రముఖ కంపెనీలు పెద్ద ఎత్తున క్యూ కట్టడం హర్షించదగ్గ పరిణామమని చెప్పారు.
రాష్ట్రాన్ని సీఎం స్పోర్ట్స్ హబ్ గా చేయాలనుకుంటున్నరు
ప్రజలు బీఆర్ఎస్ ను మరిచిపోతున్నారని, గత ప్రభుత్వ పాలనలో ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను సామ్రాజ్యాలుగా ఏలారని మహేశ్ గౌడ్ విమర్శించారు. కేసీఆర్ అధిక అప్పులు చేయడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు రూ.6 వేల కోట్ల వడ్డీలు కడుతోందన్నారు. పటాన్ చెరులో జరిగిన ఘటనపై కమిటీ వేశామని, విచారణ తర్వాత చర్యలు ఉంటాయన్నారు. యూత్ కాంగ్రెస్ గొడవ విషయంలో కూడా తప్పు చేసిన వారికి శిక్ష తప్పదన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై కూడా పీసీసీ పరిశీలిస్తుందన్నారు.
రానున్న పది రోజుల్లో పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటిస్తామన్నారు. టీచర్, గ్యాడ్యుయేట్ అభ్యర్థుల ఎంపిక కోసం ముగ్గురు మంత్రులు దామోదర రాజనర్సింహా, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తో కమిటీ వేశామన్నారు. దీనిపై వారి ఆమోదం రాగానే ఢిల్లీకి పంపి పేర్లను ఫైనల్ చేస్తామన్నారు. వచ్చే బుధవారం నుంచి మంత్రులతో ముఖాముఖి ఉంటుందని, బిజీ షెడ్యూల్ వల్ల దీనికి కొంత గ్యాప్ వచ్చిందని చెప్పారు.