- బీఆర్ఎస్ రౌండ్ టేబుల్ సమావేశాలపై మహేశ్‌గౌడ్ ఫైర్
- రేసింగ్ స్కాంలో కేటీఆర్
- పాత్ర ఉంటే చట్టప్రకారం చర్యలుంటాయన్న పీసీసీ చీఫ్
హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ నేతలు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడంపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. పుష్ప2 బెనిఫిట్‌షో సందర్భంగా సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగిన ఓ మహిళా చనిపోయిన విషయంపై ఆ సమావేశాల్లో చర్చించాలన్నారు. కాంగ్రెస్ నేత సంజయ్ గాంధీ వర్ధంతి సందర్భంగా శనివారం గాంధీ భవన్ లో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన తర్వాత మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
‘‘ఒక మహిళ మృతి, ఆమె కొడుకు చావు బతుకుల మధ్య పోరాడుతుండు.. దీనికి బాధ్యులైన వారిని అరెస్టు చేస్తే ఇంత రాద్ధాంతం ఎందుకు” అని ప్రశ్నించారు. చట్టానికి ఎవరు అతీతులు కాదన్నారు. అల్లు అర్జున్ కుటుంబంతో సీఎం రేవంత్ కు బంధుత్వం ఉందని, పైగా అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడేనని అన్నారు. అయినా చట్టం ముందు అందరూ సమానమేనని తెలిపారు.
తమ ప్రభుత్వానికి అల్లు అర్జున్ పై ఎలాంటి వ్యక్తిగత కక్ష్యలు లేవన్నారు. ఈ–కార్ రేసింగ్ లో నిధులు గోల్ మాల్ జరిగినట్లు అధికారులు గుర్తించారని.. ఈ స్కాంలో కేటీఆర్ పాత్ర ఉన్నట్లు తేలితే ఆయనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మహేశ్‌గౌడ్ చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని, పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ లకు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనే ధ్యాస ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీజేపీ నేతల మాటల తీరును తప్పుపట్టారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందన్నారు.