కవితకు రాహుల్‌‌ను విమర్శించే నైతిక హక్కు లేదు : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

కవితకు రాహుల్‌‌ను విమర్శించే నైతిక హక్కు లేదు : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: తాను రౌడీ టైప్‌‌ అని చెప్పుకునే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విమర్శించే నైతిక హక్కు లేదని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. లిక్కర్ వ్యాపారం చేసే కవిత.. రాహుల్ వంటి నేతను విమర్శించుడేందని శనివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. దందాలతో దేశవ్యాప్తంగా కవిత ఫేమస్ అయ్యారని, దోపిడీకి కేరాఫ్ అడ్రస్‌‌గా కేసీఆర్ కుటుంబం నిలిచిందని ఆరోపించారు. రాహుల్ కుటుంబం మాత్రం త్యాగాలకు మారుపేరుగా మారిందన్నారు.

 పదేండ్లలో రూ.10 వేల కోట్లకుపైగా భూములను కేసీఆర్ కుటుంబం దోచుకుందని, గ్రేటర్ హైదరాబాద్‌‌ చుట్టూ ఉన్న విలువైన భూములను అతి తక్కువ ధరకే కేటీఆర్ తన అనుచరులకు దోచిపెట్టారని ఆరోపించారు. తెలంగాణలో తమ అస్తిత్వం నిలుపుకోవడం కోసం కేసీఆర్ అండ్ కంపెనీ ఆరాట పడుతోందని మండిపడ్డారు. రజతోత్సవ సభ బీఆర్ఎస్ కా, టీఆర్ఎస్ కా అని మహేశ్ ప్రశ్నించారు. రాహుల్ ఇచ్చిన మాటకు కట్టుబడి వరంగల్ డిక్లరేషన్‌‌లో పేర్కొన్న విధంగా రైతులకు రుణమాఫీ చేశామని గుర్తుచేశారు. రాహుల్‌‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.